Telugu Global
National

కరోనా పాజిటివిటీ రేటులో తెలంగాణ టాప్... దేశ సగటుకన్నా 3 రెట్లు ఎక్కువ

కరోనా కేసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మొదటి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజు రోజుకూ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ పరీక్షల సంఖ్య కూడా తక్కువే. అయితే కరోనా పాజిటివిటీ రేటులో దేశంలో తెలంగాణనే అగ్రస్థానంలో ఉండటం, దేశ సగటుకన్న ఇది మూడు రెట్లు అధికంగా నమోదవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తున్నది. రెండు వారాల క్రితం పాజిటివిటీ రేటులో మహారాష్ట్ర, ఢిల్లీ కన్నా వెనుకబడి ఉన్న రాష్ట్రం… […]

కరోనా పాజిటివిటీ రేటులో తెలంగాణ టాప్... దేశ సగటుకన్నా 3 రెట్లు ఎక్కువ
X

కరోనా కేసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మొదటి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజు రోజుకూ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ పరీక్షల సంఖ్య కూడా తక్కువే. అయితే కరోనా పాజిటివిటీ రేటులో దేశంలో తెలంగాణనే అగ్రస్థానంలో ఉండటం, దేశ సగటుకన్న ఇది మూడు రెట్లు అధికంగా నమోదవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తున్నది.

రెండు వారాల క్రితం పాజిటివిటీ రేటులో మహారాష్ట్ర, ఢిల్లీ కన్నా వెనుకబడి ఉన్న రాష్ట్రం… ఇప్పుడు 21.91 శాతంతో మొదటి స్థానానికి చేరుకుంది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 7.14 శాతమే ఉండటం గమనార్హం. గత కొన్ని రోజులుగా తెలంగాణలో 2వేల లోపు కేసులు, 7 నుంచి 10 మరణాలు ప్రతీ రోజు సంభవిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇచ్చిన గణాంకాలు పరిశీలిస్తే.. కర్ణాటక తర్వాత కేసులు అత్యంత వేగంగా రెట్టింపు అయ్యేది తెలంగాణలోనే.

కర్ణాటకలో కేసులు రెట్టింపు కావడానికి 8.5 రోజుల సమయం పడుతుండగా, తెలంగానలో 9.5 రోజుల్లో కేసులు రెట్టింపు అవుతున్నాయి. తెలంగాణలో టెస్టుల సంఖ్య కూడా తక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జులై 8 నాటికి తెలంగాణలో 1.34 లక్షల టెస్టులు మాత్రమే చేశారు. కానీ కేరళలో 2,96,183 ఒడిషాలో 3,02,780 చత్తీస్‌గడ్‌లో 1,91,938, ఝార్ఖండ్‌లో 1,64,598 టెస్టులు చేసి మెరుగైన స్థితిలో ఉన్నారు.

తెలంగాణలో అకస్మాత్తుగా కేసులు పెరగడంపై ఆందోళన నెలకొంది. ఈ విషయమై గత బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్‌తో మాట్లాడారు. వెంటనే రాష్ట్రంలో టెస్టుల సంఖ్య పెంచాలని ఆయన సూచించారు. కాగా, రాష్ట్రంలో టెస్టుల సంఖ్య పెంచినా పరీక్షించడానికి సరైన వసతి సౌకర్యాలు లేవని, ఇప్పటికే రోజుకు 4వేల టెస్టులు చేస్తున్నామని ఒక అధికారి చెప్పారు.

ప్రస్తుతం ప్రభుత్వం రాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహిస్తోంది. అయితే ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేస్తేనే కచ్చితమైన ఫలితాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు, సీనియర్ అధికారులతో గవర్నర్ తమిళిసై కోవిడ్-19పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచడమే సరైన పరిష్కారమని సమావేశంలో అభిప్రాయపడ్డారు.

మరోవైపు తెలంగాణలో మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో 2.14గా ఉన్న మరణాల రేటు ప్రస్తుతం 1.10 కు తగ్గిందని… కానీ దేశ సగటు మాత్రం 3.02గా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రం – టెస్టులు (పర్ మిలియన్) – పాజిటివిటీ రేటు

తెలంగాణ – 3,430 – 21.91 శాతం
మహారాష్ట్ర – 9,564 – 18.73 శాతం
ఢిల్లీ – 35,993 – 14.94 శాతం
తమిళనాడు – 18,824 – 8.44 శాతం
ఆంధ్రప్రదేశ్ – 20,498 – 2.8 శాతం

First Published:  10 July 2020 6:13 AM GMT
Next Story