సెల్ఫ్‌ లాక్‌డౌన్‌లో హైదరాబాద్‌ వ్యాపారులు !

గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజుకు దాదాపు 2 వేల కరోనా కేసులు బయటపడుతున్నాయి. పది రోజులుగా కేసులు తగ్గడం లేదు. వైరస్‌ అన్ని ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తోంది.

ఆఫీసులు, మార్కెట్లు, వ్యాపారుల అడ్డాలే వైరస్‌ కేంద్రాలుగా మారాయి. ఇక్కడి నుంచే ప్రధానంగా వైరస్‌ వ్యాప్తి జరుగుతోంది. దీంతో ఇప్పటికే చాలా మంది వ్యాపారాల సమయాన్ని‌ తగ్గించారు. బేగంబజార్‌లో సెల్ఫ్‌లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు.

ఇటు కొన్ని బస్తీలతో పాటు కాలనీలు కూడా సెల్ఫ్ ‌లాక్‌డౌన్‌ మోడ్‌లోకి వెళ్లాయి. తమ దగ్గర్లోనే కరోనా కేసులు నమోదవుతుండడంతో వ్యాపారస్తులు మేలుకున్నారు. కొందరు బిజినెస్‌ టైమ్‌ తగ్గించుకుంటే… మరికొందరు నెల పాటు షాపులు మూసివేయాలని నిర్ణయించారు.

ప్రభుత్వం ఆంక్షలు పెట్టినప్పుడు వ్యాపారాలు దెబ్బ తింటున్నాయని వ్యాపారులు బాధపడ్డారు. లాక్ డౌన్‌
సడలించిన తర్వాత సహజీవం తప్పదు అంటూ జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు స్వచ్చందంగా ఆంక్షలు పెట్టుకొని కొంత కాలం షాపులను బంద్ చేస్తున్నారు.

ఈ టైమ్‌లో కూడా జాగ్రత్తలు పాటించకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందని వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. అందుకే కొందరు వ్యాపారులు కూర్చొని మాట్లాడుకుని కాలనీ మొత్తం షాపులు మూసివేస్తున్నారు.

మూసాపేట సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో కరోనా వచ్చింది. అంతే డాక్యుమెంట్‌ రైటర్లు స్వచ్చంధంగా షాపులు మూసివేశారు. కరోనా కారణంగా పదిరోజులు షాపులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి చైతన్యం అందరిలో వచ్చి…వైరస్‌ వ్యాప్తి జాయింట్‌ తెగితేనే కరోనా కంట్రోల్‌లోకి వస్తుంది. కొందరి బాధ్యతారాహిత్యం వల్ల అందరూ కరోనా బారినపడాల్సి వస్తోంది.

ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి… చెన్నై, పుణే లలో లాగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధించాలని… అప్పుడే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కంట్రోల్‌లోకి వస్తుందని…. ర్యాపిడ్‌ టెస్టులతో కొంత ఉపయోగం మాత్రమే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరీ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.