బెస్ట్ సెల్లర్‌గా ‘నాలో… నాతో వైఎస్‌ఆర్’

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి గురించి ఆయన సతీమణి వైఎస్‌ విజయమ్మ … రచించిన ‘నాలో .. నాతో వైఎస్ ఆర్’‌ పుస్తకం ఆన్‌లైన్లో టాప్ సెల్లర్‌గా నిలిచింది. పుస్తకాన్ని వైఎస్‌ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. భార్యగా 37 ఏళ్ల ప్రయాణంలో వైఎస్‌ గురించి తనకు తెలిసిన అంశాలను వైఎస్ విజయమ్మ ఆ పుస్తకంలో వివరించారు.

ఈ పుస్తకాన్ని ఎమెస్కో సంస్థ ముద్రించింది. ఆన్‌లైన్‌ పోర్టల్‌ అమెజాన్ ఇండియాలో ఈపుస్తకాన్ని అందుబాటులో ఉంచారు. ఇలా ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చిన కొన్ని గంటల్లోనే పుస్తకాలన్నీ అమ్ముడుపోయాయి.

ఆన్‌లైన్‌ విక్రయాల్లో ఒక తెలుగు పుస్తకం మొదటి ఎడిషన్ కాపీలన్నీ తొలిరోజే అమ్ముడుపోవడం ఇదేతొలిసారి అని ఎమెస్కో పబ్లికేషన్స్ చెబుతోంది. పుస్తకాన్ని కొన్న వారు ఫైవ్‌ స్టార్ రేటింగ్ ఇచ్చారు. మొదటి ఎడిషన్ కింద 5వేల కాపీలను అందుబాటులోకి తేగా అవి కొన్ని గంటల వ్యవధిలోనే అమ్ముడుపోయాయి.

డిమాండ్‌ భారీగా ఉన్ననేపథ్యంలో భారీగా కాపీల ముద్రణ చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. సోమవారం నాటికి రెండో ఎడిషన్ పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది.

ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్‌లో కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్‌లో అందించేందుకు పెంగ్విన్ పబ్లికేషన్స్ ముందుకొచ్చింది.