ప్రొడ్యూసర్ గా మారిన చిరంజీవి కూతురు

‘సైరా నరసింహారెడ్డి’ సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన మెగాస్టార్ చిరంజీవి తనయ సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. నిర్మాతగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌/ఓటీటీ రంగంలోకి తొలి అడుగులు వేస్తున్నారు.

నిర్మాతలు విష్ణు ప్రసాద్, సుష్మితా కొణిదెల… ఓ ఒరిజినల్ సిరీస్ కోసం జీ5తో అసోసియేట్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ ఈరోజు లాంఛనంగా మొదలైంది. సుశ్మిత తల్లి, చిరంజీవి భార్య సురేఖ ప్రత్యేక అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో 8 ఎపిసోడ్స్‌తో కూడిన ఒక క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ గా ఇది రాబోతోంది. దీనికి ఆనంద్ రంగా దర్శకుడు. ‘ఓయ్’ సినిమా తరవాత ఆయన దర్శకత్వం వహిస్తున్న సబ్జెక్టు ఇదే. ఇందులో ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘జీ 5’ ఓటీటీలో ఈ సిరీస్ ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది.