రాజస్థాన్‌లో రాజకీయం మారుతోందా? గెహ్లాట్‌ ఆరోపణల వెనుక కథేంటి ?

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీని తిరిగి కాంగ్రెస్‌ అధ్యక్షున్ని చేయాలని ఎంపీలు పట్టుబట్టారు. ఇదే టైమ్‌లో ఎడారి రాష్ట్రంలో రాజకీయం రంజుగా మారే సూచనలు కన్పిస్తున్నాయి.

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ బీజేపీపై ఆరోపణలు చేశారు. తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని వాపోయారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు కొనాలని చూస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే ముందు 15 కోట్లు… కండువా మార్పిడి తర్వాత 10 కోట్లు ఇచ్చేందుకు బీజేపీ నేతలు ఆఫర్‌ ఇచ్చారని చెప్పారు. తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని వివరించారు.

అశోక్‌గెహ్లాట్‌ సడెన్ ఆరోపణల వెనుక కథేంటి? అన్న అనుమానాలు మొదలయ్యాయి. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సిందియా ఇటీవలే బీజేపీలో చేరారు. కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌ సింగ్‌లతో చెడి ఆయన కమలం వైపు చేరారు. రాజస్థాన్‌లో కూడా సచిన్‌ పైలెట్‌ కు కూడా బీజేపీ వల వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా గెహ్లాట్‌తో సచిన్‌కు విభేదాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న సచిన్‌ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇటు బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిపై నమ్మకం లేకే అశోక్‌గెహ్లాట్‌ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ గ్రూపు రాజకీయాలతో తమకు సంబంధం లేదని అంటున్నారు.

గతంలో రాహుల్‌ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు కాంగ్రెస్‌లో సీనియర్‌ లీడర్లతో ఆయనకు సమస్యలు వచ్చాయి. వారిని పక్కనపెట్టలేక….కొత్త తరానికి మద్దతు ఇవ్వలేక రాహుల్‌ సతమతమయ్యారు. 2019లో కాంగ్రెస్‌ ఓటమికి కారణమయ్యారు. దీంతో పార్టీ అధ్యక్ష పదవికి దూరమయ్యారు రాహుల్. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో లాగే సీనియర్లు, జూనియర్ల మధ్య రాజస్థాన్‌లో పోరు మొదలైంది. ఈ సమస్య మరో యువ నేత కాంగ్రెస్‌కు దూరమయ్యే పరిస్థితి వచ్చిందనేది విశ్లేషకుల మాట.