బెంగళూరులో మళ్లీ లాక్‌డౌన్… వారం రోజుల పాటు అమలు !

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించింది. జులై 14 రాత్రి 8 గంటల నుంచి 22 ఉదయం ఐదు గంటల వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది.

బెంగళూరు అర్బన్‌తో పాటు బెంగళూరు రూరల్‌ జిల్లాల్లో లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఆసుపత్రులు, మెడికల్‌ షాపులు, పాలు, కూరగాయలు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి యడ్యూరప్ప తెలిపారు. చాలా మంది నిపుణులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు…ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

కర్నాటకలో బెంగళూరు అర్బన్‌లో అత్యధిక కరోనా కేసులు నమోదు అయ్యాయి. శనివారం బెంగళూరులో 1,533 కేసులు పాజిటివ్‌ గా తేలాయి. ఇప్పటివరకూ నగరంలో మొత్తం 16,862 కేసులు నమోదు అయ్యాయి. 229 మంది వైరస్‌ బారిన పడి చనిపోయారు.

కర్నాటకలో మొత్తం కేసులు 36,216. మృతులు 613. ఇప్పటివరకూ 14,716 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

కర్నాటకతో పాటు బెంగాల్‌ కూడా జులై 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగించింది. నాగాలాండ్‌, గౌహతిలో కూడా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.