పవర్ స్టార్ లో బండ్ల గణేశ్ ఎపిసోడ్…

చూస్తుంటే.. పవన్ కల్యాణ్ ను ఈసారి రామ్ గోపాల్ వర్మ చాలా గట్టిగా కెలికేలా ఉన్నాడు. పవన్ కు తను వీరాభిమానిని అంటూనే అతడ్ని ఎంతగా విమర్శించాలో అంతలా విమర్శించడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోంది. పవర్ స్టార్ అనే సినిమా ప్రకటించిన వర్మ.. అందులో ఇప్పటికే చిరంజీవి, త్రివిక్రమ్ పాత్రలతో పాటు పవన్ భార్య క్యారెక్టర్ కూడా ఉంటుందని పరోక్షంగా వెల్లడించాడు. ఇప్పుడీ లిస్ట్ లో బండ్ల గణేశ్ క్యారెక్టర్ ను కూడా చొప్పించాడు.

అవును.. పవర్ స్టార్ సినిమాలో బండ్ల గణేశ్ పాత్ర కూడా ఉంది. పవన్ ను తన దేవుడిగా చెప్పుకొస్తాడు బండ్ల. స్టేజ్ ఎక్కితే పవన్ ను బండ్ల గణేశ్ పొగిడినట్టు మరో వ్యక్తి పొగడలేడు. అంతలా పవన్ పై తన వినయవిధేయతలు చూపిస్తుంటాడు. అయితే బండ్ల దాన్ని విధేయత అనుకుంటాడు. జనాలు మాత్రం కామెడీగా చూస్తారు.

సరిగ్గా ఈ కామెడీ యాంగిల్ నే పవర్ స్టార్ సినిమాలో చూపించబోతున్నాడు ఆర్జీవీ. నిజానికి పవన్ పై కామెడీ చేయడం వర్మకు కొత్తకాదు. అమ్మరాజ్యంలో కడపబిడ్డలు సినిమాలోనే పవన్ పాత్రను కామెడీ చేసి పడేశాడు. అప్పట్లో పవన్ పక్కన ఉండే ఓ సహాయకుడ్ని కూడా కామెడీగా చూపించిన వర్మ.. ఈసారి బండ్ల గణేశ్ పాత్రను అంతే కామెడీగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ లిస్ట్ లో ఇప్పటివరకు నాగబాబు పేరు వినిపించలేదు.