ప్రభుత్వం జగన్‌ది… అంతా ఆయన మనుషులే…

చంద్రబాబు రాజకీయ చాతుర్యానికి, ఎత్తుగడలకు రాజకీయ పరిశీలకులు షాక్‌ అవుతున్నారు. రాజకీయాల మీద మంచి అవగాహన ఉన్న వైసీపీ శ్రేణులకు కూడా దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అవుతోంది. ఒక్కముక్కలో చెప్పాలంటే ఎంతైనా చంద్రబాబు అసాధ్యుడబ్బా… అంటున్నారంతా.

చంద్రబాబు కింగ్‌ మేకర్‌ అని ఆయన అభిమానులు ఎప్పుడూ కీర్తిస్తుంటారు…. ఎంతో ముందుచూపుతో అన్ని వ్యవస్థల్లోనూ చంద్రబాబు తన మనుషులను పెట్టేస్తాడని, వాళ్ళతో తనకు కావాల్సిన విధంగా కథ నిడిపిస్తాడని ఎంతో మంది రాజకీయనాయకులు, జర్నలిస్టుల అభిప్రాయం.

చివరకు జగన్‌ కూడా అనేకసార్లు చంద్రబాబు తన మనుషులను అన్ని వ్యవస్థలలోనూ చొప్పించి… ఏవిధంగా రాజకీయం చేస్తాడో అనేక సభల్లో, సమావేశాల్లో చెప్పాడు‌.

జగన్ అధికారంలోకి వచ్చాక జరిగిన అనేక రాజకీయ పరిణామాలు, జగన్‌ ప్రభుత్వానికి పలు వ్యవస్థల్లో అడుగడుగునా ఎదురుదెబ్బలు తగులుతూ ఉన్నప్పుడు కూడా వైసీపీ శ్రేణుల అభిప్రాయం ఒక్కటే…. అన్ని వ్యవస్థల్లోనూ చంద్రబాబు మనుషులు ఉండబట్టే ఇలా జరుగుతుందని వాపోతున్నారు.

వీళ్ళందరి అంచనాలకు అందని విధంగా, అందరూ ఆశ్చర్యపోయేలా ఎవరూ ఊహించని విధంగా తన మరో ప్లాన్‌ను విజయవంతంగా అమలు చేయగలిగాడు చంద్రబాబు.

అన్ని వ్యవస్థల్లోనూ చంద్రబాబు తన మనుషులను పెడతాడు అని బాగా తెలిసిన జగన్‌ ప్రభుత్వంలోనే అనేక కీలకమైన స్థానాల్లో తన మనుషులను విజయవంతంగా పెట్టగలిగాడు చంద్రబాబు.

వీళ్ళందరూ చెప్పినట్టు చాలా వ్యవస్థలను మేనేజ్‌ చేసిన చంద్రబాబు… ఇప్పుడు జగన్‌ ప్రభుత్వాన్ని కూడా పరోక్షంగా మేనేజ్‌ చేయగలుగుతున్నాడని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

మొదటి దశలో చంద్రబాబు ”ప్లాన్‌ ఎ” లో భాగంగా తన మనుషులను జగన్‌ ప్రభుత్వంలో కీలకమైన స్థానాల్లో ఉండేలా చూసుకున్నారు. ఇప్పుడు “ప్లాన్‌ బి” లో భాగంగా జగన్‌ మనుషులను, వైసీపీ అభిమానులైన అధికారులను పక్కకు తప్పించే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేయిస్తున్నాడని వైసీపీ అభిమానులు వాపోతున్నారు.

రాష్ట్రంలో అనేక కీలకమైన అధికార స్థానాలలో చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రులైన వ్యక్తులు నియమితులు అవుతూ ఉండడం వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి.

ప్రభుత్వంలో మంచి పోస్టులు కోరుకునే అధికారులు… చంద్రబాబు వద్దకు, ఆయన హయాంలో అధికారం చెలాయించిన, పోస్టింగ్‌లు వేయించిన వ్యక్తుల వద్దకు వెళ్ళి సహాయం కోరే పరిస్థితి వచ్చిందంటున్నారు.

అన్ని వ్యవస్థల్లోనూ తన మనుషులను పెట్టగలిగిన చంద్రబాబు… చివరకు జగన్ ప్రభుత్వంలో కూడా కీలకమైన స్థానాల్లో తన మనుషులను పెట్టినందుకు టీడీపీ శ్రేణులు మహదానందంగా ఉన్నాయి.