అటు కరోనా కేసులు… ఇటు ఈ కేసులు !

ఇంటాబయటా ప్రతి మనిషీ కరోనాతో పోరాటం చేస్తున్న తరుణంలో మహిళలు మరొక రకమైన పోరాటం కూడా చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి విధించిన లాక్ డౌన్ కాలంలో మహిళలపై హింస, నేరాలు పెరిగిపోయాయనే వార్తలు విన్నాం. అవన్నీ నిజమేనని నిరూపించే ఆధారం మరొకటి మనముందుకు వచ్చింది.

గత జూన్ ఒక్క నెలలోనే జాతీయ మహిళా కమిషన్ కి బాధిత మహిళల నుండి 2,043  ఫిర్యాదులు అందాయి. ఈ సంఖ్య గత ఎనిమిది నెలల కాలంలో అత్యధికమని జాతీయ మహిళా కమిషన్ తెలిపింది. ఇందులో 603 కేసులు గౌరవంగా జీవించే హక్కుకి భంగం కలిగిందని పెట్టినవి. మానసికంగా విపరీతమైన బాధకు అవమానానికి నిస్సహాయతకి గురయిన పరిస్థితుల్లో మహిళలు చేసిన ఫిర్యాదులు ఇవి.

ఆ తరువాత స్థానంలో గృహహింసకి సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.  ఒక్క జూన్ లోనే ఇవి 452.

252 ఫిర్యాదులు వివాహితలపై హింస, వరకట్న వేధింపులు కాగా, 194 ఇతర హింసాత్మక వేధింపులకు సంబంధించినవి. పోలీసులు పట్టించుకోకపోవటంపై 113, సైబర్ నేరాలకు సంబంధించి 100 ఫిర్యాదులు అందాయి. అత్యాచారం, అత్యాచార ప్రయత్నానికి సంబంధించినవి 78కాగా, లైంగిక వేధింపుల ఫిర్యాదులు 38 ఉన్నాయి.

సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా తాము ఫిర్యాదులు తీసుకుని కేసులు నమోదు చేసుకోవటం వలన మరింత ఎక్కువగా బాధిత మహిళలు ముందుకు వస్తున్నారని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖాశర్మ అన్నారు. ట్విట్టర్ తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఫిర్యాదులు తీసుకుంటున్నామని, ఇప్పుడు వాట్సప్ నెంబర్ సైతం అందుబాటులో ఉంచామని… తమ నుండి సహాయం అందుతుందనే నమ్మకం ఉండటం వల్లనే మహిళలు మరింతగా తమ సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నారని రేఖాశర్మ తెలిపారు.