Telugu Global
National

మనసున్న... సేవ !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత మానసిక అనారోగ్యాలు మనిషిని ఇంతగా కుంగదీస్తాయా… అనే ఆశ్చర్యం, ఆందోళన అందరిలోనూ కలిగింది. మనసు అనేది మన కంటికి కనిపించనట్టుగానే మానసిక అనారోగ్య లక్షణాలు సైతం పైకి కనిపించవు. డిప్రెషన్, యాంగ్జయిటీ, రకరకాల ఫోబియాలు లాంటివాటికి చికిత్స తీసుకోకుండానే బతికేస్తుంటారు చాలామంది. అయితే మానసిక సమస్యలు ఎంత బాధకు గురిచేస్తాయో వాటిని అనుభవించినవారికే తెలుస్తుంది. ఢిల్లీలో నివసిస్తున్న అంకిత్ గుప్తకి కూడా ఆ విషయం తెలుసు. […]

మనసున్న... సేవ !
X

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత మానసిక అనారోగ్యాలు మనిషిని ఇంతగా కుంగదీస్తాయా… అనే ఆశ్చర్యం, ఆందోళన అందరిలోనూ కలిగింది. మనసు అనేది మన కంటికి కనిపించనట్టుగానే మానసిక అనారోగ్య లక్షణాలు సైతం పైకి కనిపించవు.

డిప్రెషన్, యాంగ్జయిటీ, రకరకాల ఫోబియాలు లాంటివాటికి చికిత్స తీసుకోకుండానే బతికేస్తుంటారు చాలామంది. అయితే మానసిక సమస్యలు ఎంత బాధకు గురిచేస్తాయో వాటిని అనుభవించినవారికే తెలుస్తుంది. ఢిల్లీలో నివసిస్తున్న అంకిత్ గుప్తకి కూడా ఆ విషయం తెలుసు. ఎందుకంటే అతను డిప్రెషన్ కి గురై దానినుండి బయటపడ్డాడు.

అందుకే కరోనా మహమ్మారి సమాజాన్ని కుదిపేస్తున్న ఈ తరుణంలో ఒక వినూత్నమైన ఆలోచన చేశాడు. మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటూ…. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి చికిత్సని మానేసినవారికి అండగా నిలవాలని అనుకున్నాడు.

అంకిత్ గుప్తా తన ట్విట్టర్ ఖాతా ద్వారా మానసిక చికిత్స అవసరం ఉన్నవారు తనని సంప్రదించాలని కోరుతున్నాడు. అలా వచ్చినవారికి… మానసిక నిపుణులు ఫోన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాడు. చికిత్స పొందుతున్నవారి తరపున ఫీజు తనే చెల్లిస్తున్నాడు. ఢిల్లీ, ముంబయికి చెందిన కొందరు సైకాలజిస్టులు తమ ఫీజు తగ్గించుకుని ఆన్ లైన్ లేదా ఫోన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అంగీకరించడంతో… అంకిత్ గుప్తా తను చేయాలనుకున్న పనిని సులువుగా చేయగలుగుతున్నాడు.

‘లాక్ డౌన్ తరువాత చాలామంది ఉపాధిని కోల్పోయారు. దాంతో మానసిక సమస్యలున్నవారు చికిత్సని మానేయటం నేను గమనించాను. మనదేశంలో మానసిక సమస్యలకు చికిత్స చాలా ఖరీదైనది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను’ అంటున్నాడు అంకిత్.

అతను ట్విట్టర్ ద్వారా తన మనసులో మాట చెప్పగానే వెనువెంటనే 20మంది అంకిత్ ని సంప్రదించారు. అలా తనని చికిత్సకోసం ఆశ్రయించినవారు మొదటిసారి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నవారా, అంతకుముందే చికిత్స తీసుకుంటూ ఉంటే… వారికి ఇంకా ట్రీట్ మెంట్ అవసరం ఉందా… అనే అంశాలను తెలుసుకుని… తనకు తెలిసిన మానసిక నిపుణులతో వారిని అనుసంధానం చేస్తున్నాడు. ఆ సైకాలజిస్టులు సెషన్ కి రూ.300 చొప్పున తీసుకుంటూ ఫోన్ లేదా ఆన్ లైన్ ద్వారా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. గత మూడు వారాల్లోనే 35 మంది అంకిత్ గుప్తా సహాయంతో కౌన్సెలింగ్ పొందారు.

కరోనా అనేక రకాలుగా మనిషిని దెబ్బతీసి కుంగదీస్తున్న ఈ సమయంలో మానసిక సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతకుముందే మానసిక అనారోగ్యాలు ఉంటే వారిలో ఆ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. కరోనా మనిషినుండి మనిషికి వ్యాపిస్తూ క్షోభ పెడుతుంటే… అదే సమయంలో అనేక రూపాల్లో మనిషి నుండి మనిషికి అందుతున్న సహాయం, సేవ… మనోధైర్యాన్ని పెంచుతున్నాయి. తన పెద్ద మనసుని చాటుకున్న అంకిత్ గుప్తా వయసు 27 సంవత్సరాలు. అతను ఉర్దూలో కవిత్వాలు రాస్తాడు. కంటెంట్ రైటర్ గా పనిచేస్తున్నాడు.

First Published:  15 July 2020 8:44 AM GMT
Next Story