కరోనా ఎఫెక్ట్…. తెలంగాణ ఐఏఎస్‌లపై వేటు !

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మాత్రమే వైరస్‌ వ్యాప్తి ఉండేది. ఇప్పుడు జిల్లాలకు పాకింది. కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో రోజుకు 50కి పైగా కేసులు బయటపడుతున్నాయి.

కరోనాను కంట్రోల్‌ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు ఇంటా బయటా అంతటా మొదలయ్యాయి. మొదట్లో సీఎం కేసీఆర్‌ మాటలు చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో కరోనా కంట్రోల్ లోనే ఉంది. రోజుకు వంద, రెండు వందల కేసులు దాటలేదు. వీరిలో ఎక్కువగా విదేశాల నుంచి వచ్చినవారే ఉన్నారు.

ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది. గ్రేటర్‌ హైదరాబాదే కాదు… జిల్లాల్లో పరిస్థితి అదుపు తప్పింది. గాంధీ ఆసుపత్రి మాత్రమే కోవిడ్‌ సెంటర్‌గా మారింది. ఆ తర్వాత కోఠితో పాటు ఎర్రగడ్డ చెస్ట్‌ ఆసుపత్రి, నేచుర్‌క్యూర్‌ ఆసుపత్రులను చేర్చారు. పరీక్షలు చేయడంలో అలసత్వం చేశారు. కరోనాను కంట్రోల్ చేయడం‌లో అధికారులు నిర్లక్ష్యం వహించారని వారిపై వేటు వేశారు.

ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారిని తప్పించింది ప్రభుత్వం. ఆమె స్థానంలో కొత్త హెల్త్‌ సెక్రటరీగా సయ్యద్‌ అలీ ముర్తజాను నియమించింది. ఇటు ఆరోగ్యశాఖ కమిషనర్‌ యోగితారాణాపై కూడా వేటు పడింది. ఆమె స్థానంలో వి.కరుణను నియమించారు.

కరోనా నియంత్రణతో పాటు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు తెలిసింది.

మరోవైపు ఆదిలాబాద్ కలెక్టర్‌ దేవసేన ను బదిలీ చేశారు. ఆమె స్థానంలో‌ పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ‌ను నియమించారు. మంచిర్యాల కలెక్టర్‌ భారతి హోళికర్‌కు అదనపు బాధ్యతలు అప్పజెప్పారు.

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా ఉన్న చిత్రా రామచంద్రన్‌ స్థానంలో దేవసేన ను నియమించారు. ఈమెను కూడా ఆన్‌లైన్‌ క్లాస్‌లు, ఇతర పరీక్షలు నిర్వహించడంలో అలసత్వం వహించడం వల్ల వేటు వేశారని తెలుస్తోంది.