Telugu Global
National

కాల్ చేయండి... కేసు పెడదాం !

ఆకలివేసినవాడికి అన్నం కరువు లాంటిదే… అనారోగ్య బాధితుడికి వైద్యం అందకపోవటం… అంతకంటే ఎక్కువే కూడా. కోవిడ్ 19 పుణ్యమా అని ఇప్పుడు వైద్యానికి తీవ్రమైన కరువొచ్చింది. హాస్పటల్స్ వాళ్లు బెడ్లు ఖాళీ లేవని, చేర్చుకోలేమని తిరస్కరిస్తున్నారు. ప్రాణాలతో పోరాడుతున్న తమ ఆప్తులను తీసుకుని హాస్పటల్స్ మెట్లు ఎక్కి దిగుతూ నిస్సహాయంగా మిగిలిపోతున్నవారు ఎందరో. చాలా తరచుగా ఇలాంటి వార్తలు వింటున్నాం. ఢిల్లీలో ఉంటున్న న్యాయవాది హేమంత్ గులాటీకి సైతం ఇలాంటి సమస్యని ఎదుర్కొంటున్న అనేకమంది ఫోన్ చేస్తున్నారు. […]

కాల్ చేయండి... కేసు పెడదాం !
X

ఆకలివేసినవాడికి అన్నం కరువు లాంటిదే… అనారోగ్య బాధితుడికి వైద్యం అందకపోవటం… అంతకంటే ఎక్కువే కూడా. కోవిడ్ 19 పుణ్యమా అని ఇప్పుడు వైద్యానికి తీవ్రమైన కరువొచ్చింది. హాస్పటల్స్ వాళ్లు బెడ్లు ఖాళీ లేవని, చేర్చుకోలేమని తిరస్కరిస్తున్నారు. ప్రాణాలతో పోరాడుతున్న తమ ఆప్తులను తీసుకుని హాస్పటల్స్ మెట్లు ఎక్కి దిగుతూ నిస్సహాయంగా మిగిలిపోతున్నవారు ఎందరో. చాలా తరచుగా ఇలాంటి వార్తలు వింటున్నాం.

ఢిల్లీలో ఉంటున్న న్యాయవాది హేమంత్ గులాటీకి సైతం ఇలాంటి సమస్యని ఎదుర్కొంటున్న అనేకమంది ఫోన్ చేస్తున్నారు. ఆయన ఢిల్లీ హైకోర్టు, ఇతర జిల్లా కోర్టుల న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నాడు. నేరాలు, వివాహ సంబంధమైన సమస్యలపై వాదిస్తుంటారు. కోవిడ్ 19 సోకినవారిని హాస్పటల్స్ చేర్చుకోవటం లేదంటూ తమకు సహాయం చేయాలంటూ ప్రతిరోజు పదుల సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తుండటంతో హేమంత్ ఈ విషయం గురించి సీరియస్ గా ఆలోచించాడు.

అలాంటి కేసులను ఉచితంగా వాదించాలనే నిర్ణయం తీసుకున్నాడు. కరోనా కు చికిత్సకోసం వెళితే హాస్పటల్స్ వాళ్లు బెడ్స్ లేవని, ట్రీట్ మెంట్ చేయలేమని చెబుతున్నారా…. అయితే నాకు కాల్ చేయండి. న్యాయవాదిగా అండగా నిలబడతాను. ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసి…. హాస్పటల్, లేదా రాష్ట్రప్రభుత్వం తగిన విధంగా స్పందించేలా, కోర్టు నుండి మీకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చేలా చేస్తానంటూ….ఒక వాట్సప్ సందేశం ఇచ్చాడు. సోషల్ మీడియాలో అది విస్తృతంగా తిరగటంతో ఇప్పుడు హేమంత్ గులాటీ పేరు, ఆయన ఫోన్ నెంబరు 79826 56531 వైరల్ అయ్యాయి.

జూన్ 19న ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి తరపున ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు హేమంత్. 60 ఏళ్ల ప్రేమ్ సింగ్ ప్రభుత్వ ఉద్యోగి. తన భార్యకు కరోనా సోకటంతో ఆమెను తీసుకుని అనేక ఆసుపత్రులు తిరిగాడు ప్రేమ్ సింగ్. చివరికి ఆమె మరణించింది. అతని కుమార్తెకు సైతం కోవిడ్ 19 సోకింది. ఆమె వయసు 34 ఏళ్లు. 85 శాతం అంగవైకల్యం ఉన్న వ్యక్తి ఆమె. భార్య మరణించిన రోజు తన కుమార్తె హాస్పటల్ బయట నిస్సహాయంగా స్ట్రెచర్ మీద ఉన్నదని, హాస్పటల్ వర్గాలు ఆమెని చేర్చుకునేందుకు ఒప్పుకోలేదని ప్రేమ్ సింగ్ తెలిపాడు. హేమంత్ కి ఫోన్ చేయగా అతను తక్షణం స్పందించాడు. రాత్రికి రాత్రే పిటీషన్ తయారుచేసి ఉదయాన్నే కేసు ఫైల్ చేశాడు.

దాంతో కేసు హియరింగ్ జరిగి… ఆ రోజే కోర్టునుండి ప్రేమ్ సింగ్ కి అనుకూలంగా కోర్టు ఆర్డరు వచ్చింది. అతని కుమార్తెని ఒక ప్రయివేటు హాస్పటల్ జాయిన్ చేసుకుంది. ఇంత సహాయం చేసిన హెమంత్ గులాటీకి తాను కృతజ్ఞత తెలుపబోగా… అది కూడా అవసరం లేదని… ప్రతి మనిషికీ అందితీరాల్సిన ప్రాథమిక హక్కు గురించి తాను పోరాటం చేస్తున్నానని… ఆయన అన్నారని ప్రేమ్ సింగ్ తెలిపాడు.

ఎన్నాళ్లిలా కోర్టులో కేసులు పెడుతూ ఆర్డర్లు తెచ్చుకోవటం… అనే ప్రశ్నకు హేమంత్ గులాటీ సమాధానం చెబుతూ…‘పరిస్థితులు అలా ఉన్నాయి. ఇవి వెనువెంటనే స్పందించాల్సిన విషయాలు. నేను చాలా త్వరగా కేసులు ఫైల్ చేస్తున్నాను. వెంటనే కోర్టునుండి ఉత్తర్వులు వస్తున్నాయి.’ అన్నాడు. ‘అయితే అన్నిసార్లూ మంచే జరుగుతుందని చెప్పలేము… ఒక పేషంట్ విషయంలో నేను పిటీషన్ తయారు చేశాను… కానీ కేసు ఫైల్ చేయకముందే అతను మరణించడం జరిగింది. ఆ రోజు చాలా బాధనిపించింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన.

తాను వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేస్తున్నానని… అవసరమైనప్పుడు స్వచ్ఛందంగా ఎలాంటి ఫీజు తీసుకోకుండా కేసులు తీసుకుంటున్నానని హేమంత్ వెల్లడించారు. కోవిడ్ 19పై పోరాటంలో హేమంత్ గులాటీ నిపుణుడైన న్యాయవాదిగానే కాకుండా మానవత్వమున్న మనిషిగా కూడా స్పందిస్తున్నాడు. కొంతమంది న్యాయవాదులైనా హేమంత్ లా స్పందించాల్సిన అవసరం ఇప్పుడు ఉందని అంటున్నారు.

First Published:  16 July 2020 5:50 AM GMT
Next Story