చరణ్ సరసన “మహానటి”

ఆచార్య సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఒకవేళ ఉన్నఫలంగా సెట్స్ పైకొచ్చినా చేసేదేం లేదు. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ తో చేయాల్సిన కీలకమైన ఎపిసోడ్ ఒకటి పెండింగ్ లో పడింది. ఆ ఎపిసోడ్ షూటింగ్ స్టార్ట్ చేయాలంటే చరణ్ మాత్రమే ఉంటే సరిపోదు. హీరోయిన్ కూడా కావాలి. ఆ హీరోయిన్ ఎవరనేది క్లారిటీ లేదు. కాబట్టి ఆచార్య ఇప్పట్లో సెట్స్ పైకి రాదు.

సినిమాలో చిరంజీవికి హీరోయిన్ ను సెట్ చేయడానికి చాలా టైమ్ తీసుకున్నాడు కొరటాల శివ. ఎన్నో ఆలోచించి ఫైనల్ గా త్రిషను తీసుకున్నారు. అయితే ఆఖరి నిమిషంలో త్రిష కూడా హ్యాండ్ ఇవ్వడంతో మరోసారి కాజల్ ను రిపీట్ చేశారు. ఇప్పుడు చరణ్ విషయంలో కూడా అదే జరిగే ప్రమాదముందని భావిస్తున్నారు.

ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో తెలియకుండా ఈలోగా హీరోయిన్ ను ఎంపిక చేస్తే, తీరా సెట్స్ పైకి వచ్చే టైమ్ కు ఇబ్బందులు వస్తాయని యూనిట్ భావిస్తోంది. అయితే వీళ్లకు ఓ హీరోయిన్ నుంచి పూర్తి భరోసా లభించినట్టు తెలుస్తోంది. ఆ హీరోయిన్ పేరు కీర్తిసురేష్.

అవును.. ఆచార్య సినిమాలో చరణ్ సరసన నటించడానికి ఒప్పుకుందట కీర్తిసురేష్. అది చిన్న పాత్రే అయినప్పటికీ.. చిరంజీవి-చరణ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో చేయడానికి ఒప్పుకుందట. అంతేకాదు.. ఎప్పుడు అడిగినా కాల్షీట్లు ఇవ్వడానికి రెడీ అని కూడా హామీ ఇచ్చిందట. దీంతో ఆచార్య సినిమాకు సంబంధించి ఓ పెద్ద సమస్య తీరినట్టయింది.