మందు కొట్టి నటించిన కోట

తెలుగుతెరపై విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన నటన, శైలి, డైలాగ్ డెలివరీ ఎంతో విభిన్నం. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న నటుడిగా కోట శ్రీనివాసరావు అంటే తెలియని వారుండరు. ఇలాంటి నటుడిపై కూడా అప్పుడప్పుడు విమర్శలు వస్తుంటాయి. వాటిలో ఎక్కువగా వినిపించే విమర్శ ఒకటుంది. అదేంటంటే.. కోట శ్రీనివాసరావు మందు కొట్టి షూటింగ్స్ కు హాజరవుతుంటాడని.

చాలా మంది దీన్ని పుకారుగా కొట్టిపారేశారు. అంతటి వ్యక్తి తాగి లొకేషన్ కు వస్తాడా అని వాదించేవారు కూడా ఉన్నారు. నిజంగా కోట అలాంటి పనులు చేసుంటే ఇన్నేళ్లు పరిశ్రమలో ఉండేవారు కాదనే వాదన కూడా ఉంది. వీటన్నింటికీ తాజాగా ఫుల్ స్టాప్ పెట్టారు కోట. తను తాగి నటించిన మాట వాస్తవమేనని అంగీకరించారు.

కెరీర్ లో దాదాపు 25 సినిమాలకు పైగా తను మద్యం సేవించి నటించిన సందర్భాలున్నాయని స్వయంగా వెల్లడించారు కోట. అయితే అలా నటించిన సన్నివేశాల్లో తనకు డైలాగ్స్ లేవని ఆయన అన్నారు. పైగా దర్శకుల అనుమతితోనే, తప్పనిసరి పరిస్థితుల మధ్య మందు కొట్టి నటించానని స్పష్టంచేశారు.