నీటి పారుదల రంగం మొత్తం ఒకే గూటికి

  • సచివాలయం పైనా సమీక్ష
  • రెండ్రోజులు కేసీఆర్ సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో శాఖోపశాఖలుగా ఉన్న నీటి పారుదల రంగం మొత్తాన్ని ఒకే గూటికి చేర్చాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఆ శాఖను మొత్తం పునర్ వ్యవస్థీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే శాఖ కింది 15-20 ప్రాదేశీక విభాగాలుగా చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ముసాయిదాను తయారు చేయాలని గత వారంలోనే సీఎం అధికారులను ఆదేశించారు. దీంతో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ రెండు రోజుల పాటు నీటిపారుదల శాఖ పునర్ వ్యవస్థీకరణపై వర్క్ షాప్ నిర్వహించి ముసాయిదా తయారు చేశారు.

ప్రస్తుతం నీటిపారుదల శాఖ భారీ, మధ్య, చిన్నతరహా, ఐడీసీ, ప్రాజెక్టులు, ప్యాకేజీలుగా విభజించబడి ఉంది. దీంతో వీటన్నింటినీ కలిపేసి నీటి పారుదల శాఖను పలు ప్రాదేశీక విభాగాలుగా మార్చి, ప్రతీ దానికి ఒక్కో చీఫ్ ఇంజనీర్‌ను నియమించాలని నిర్ణయించారు. ఇకపై సీఈ పరిధిలోనే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, లిఫ్టులు, కాలువలు, చెరువులు, చెక్‌డ్యామ్‌లు ఉండబోతున్నాయి.

అధికారులు తయారు చేసిన ముసాయిదాపై సోమవారం మధ్యహ్నం 2 గంటల నుంచి సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన సూచనలు అధికారుల నుంచి స్వీకరించి, ముసాయిదాపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, సీఎం కార్యదర్శి, ఈఎన్సీ, సీఈలు పాల్గొంటారు.

కొత్త సచివాలయ నిర్మాణంపై కూడా సమీక్ష

సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణంపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రోడ్లు, భవనాల శాఖ అధికారులు, సంబంధిత ఇతర అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమీక్షా సమావేశంలో సచివాలయం డిజైన్లు, ఎక్స్‌టీరియర్లు ఎలా ఉండాలనే విషయం చర్చించనున్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రం తెలంగాణ ప్రతిష్ట, వైభవానికి ప్రతీకగా ఉండాలని సీఎం భావిస్తున్నారు. ఈ సమీక్ష ముగిసిన తర్వాత వీటిపై క్యాబినెట్‌లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం టెండర్లు పిలుస్తారు.