వైన్‌షాపులు గంట పొడిగింపు… కానీ అమ్మకాల కోసం కాదు

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులను మరో గంట సేపు అదనంగా తెరిచి ఉంచనున్నారు.

ఇప్పటి వరకు రాత్రి 8 గంటలకు షాపులను క్లోజ్ చేస్తున్నారు. ఇకపై 9 వరకు తెరిచి ఉంటాయి. అయితే ఈ అదనపు గంట మద్యం అమ్మకాల కోసం కాదు. అమ్మకాలకు సంబంధించిన లెక్కలు సరిచూసుకోవడానికి ఈ గంటను కేటాయించారు.

మద్యం షాపులను కాంప్రహెన్సివ్‌ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌ సిస్టంకు అనుసంధానం చేసిన నేపథ్యంలో ఏ రోజు ఆదాయాన్ని అదే రోజు ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. అకౌంట్లను, స్టాక్‌ను సరిచూసుకోవడానికి, డబ్బు లెక్కించి ఆదాయాన్ని జమ చేసేందుకు వీలుగా ఈ అదనపు గంటను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.