ఓటీటీలోకి మరో పెద్ద హీరో సినిమా

ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా పెద్ద సినిమాలు ఓటీటీ వైపు క్యూ కడుతున్నాయి. తమిళ, తెలుగు భాషల్లో త్వరలోనే పెద్ద సినిమాలు ఓటీటీలో కనువిందు చేయబోతున్నాయి. ఇప్పుడీ సౌత్ రేసులోకి హాట్ స్టార్ కూడా ఎంటరైంది. డిస్నీ సంస్థ ఎంటరైన తర్వాత సౌత్ సినిమాలపై వీళ్లు ఫోకస్ తగ్గించారు. ఎక్కువగా ఒరిజినల్ కంటెంట్, బాలీవుడ్ మూవీస్ పైనే దృష్టిపెట్టారు. ఇప్పుడిప్పుడే సౌత్ పై దృష్టిపెట్టిన డిస్నీ హాట్ స్టార్ సంస్థ.. బడా మూవీస్ తో హల్ చల్ చేయాలని చూస్తోంది.

ఇందులో భాగంగా విక్రమ్ సినిమాతో డీల్ మాట్లాడుతోంది. ప్రస్తుతం కోబ్రా అనే సినిమా చేస్తున్నాడు విక్రమ్. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. షూటింగ్ కూడా కొంచెం ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉన్నట్టుంది. ఇప్పుడీ సినిమాను నేరుగా తమ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు విక్రమ్ తో చర్చలు జరుపుతోంది డిస్నీ హాట్ స్టార్.

నిజానికి ఈ విషయంలో నిర్మాతలు ఓపెన్ గానే ఉన్నారు. నేరుగా ఓటీటీకి ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాకపోతే విక్రమ్ ఓకే అంటేనే ఇస్తామనే కండిషన్ పెట్టారు. దీంతో హాట్ స్టార్ జనాలు నేరుగా విక్రమ్ తో చర్చలు షురూ చేశారు. విక్రమ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

తమిళనాట నేరుగా ఓటీటీలకు సినిమాలు ఇవ్వడాన్ని అక్కడ థియేటర్ యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేస్తున్నాయి. నడిగర్ సంఘంలో ఓ వర్గం కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. మొన్నటికిమొన్న జ్యోతిక సినిమాను నేరుగా ఓటీటీకి ఇచ్చినందుకే చాలా రచ్చ జరిగింది. ఇప్పుడు ఏకంగా విక్రమ్ లాంటి స్టార్ హీరో సినిమా థియేటర్లను కాదని ఓటీటీకి వెళ్లిపోతుంటే.. యాజమాన్యాలు మరింత ఆందోళనకు దిగే ప్రమాదముంది. దీన్ని విక్రమ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.