కరోనాను గెలిచిన ప్రపంచ సుందరి

మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడామె ఈ వైరస్ నుంచి పూర్తిగా కోలుకుంది. ఐశ్వర్యతో పాటు ఆమె కూతురు ఆరాధ్యకు తాజాగా నిర్వహించిన టెస్టుల్లో నెగెటివ్ వచ్చింది. దీంతో వాళ్లను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు.

ఐశ్వర్య, ఆరాధ్య డిశ్చార్జ్ అయిన విషయాన్ని ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్ నిర్థారించాడు. భార్య, కూతురు ఇద్దరూ కరోనా నుంచి బయటపడ్డారని, ఇంటికెళ్లారని స్పష్టంచేసిన అభిషేక్.. తను, తండ్రి అమితాబ్ మాత్రం హాస్పిటల్ లోనే ఉన్నామని తెలిపాడు.

ప్రస్తుతం అమితాబ్, అభిషేక్ కు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మరో వారం రోజుల తర్వాత మరోసారి వీళ్లిద్దరికీ వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్ వస్తే డిశ్చార్జ్ చేస్తారు.

ఈనెల 12న హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు అమితాబ్, అభిషేక్. ఐశ్వర్య, ఆమె కూతురు ఆరాధ్యకు ప్రారంభంలో ఇంట్లోనే ట్రీట్ మెంట్ ఇచ్చినప్పటికీ తర్వాత వాళ్లు కూడా అదే హాస్పిటల్ కు షిఫ్ట్ అయ్యారు. ఐశ్వర్య, ఆరాధ్య త్వరగా కోలుకున్నారు. అమితాబ్, అభిషేక్ కు ఇంకా చికిత్స కొనసాగుతోంది.