Telugu Global
National

కరోనానీ వదలడం లేదు వీళ్ళు....

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సుధీర్ఘంగా సమీక్షలు నిర్వహిస్తుంటారన్న ఫిర్యాదు ఉంది. సుధీర్ఘ సమీక్షలు, అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా అధికారాన్ని ఆనందించడం ఆయనకు తొలి నుంచి ఉన్న అలవాటే. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ అలవాటును ఆయన మార్చుకోలేకపోతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల డాక్టర్లతో సుధీర్ఘంగా జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాన్ని తప్పుపట్టలేం. కానీ ఈ కాన్ఫరెన్స్ మేథోమథానికి కాకుండా రాజకీయ ప్రయోజనాలకే ఆయన వాడేశారు. చంద్రబాబు మాటల్లో ఒక విషయం చెప్పారు. […]

కరోనానీ వదలడం లేదు వీళ్ళు....
X

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సుధీర్ఘంగా సమీక్షలు నిర్వహిస్తుంటారన్న ఫిర్యాదు ఉంది. సుధీర్ఘ సమీక్షలు, అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా అధికారాన్ని ఆనందించడం ఆయనకు తొలి నుంచి ఉన్న అలవాటే.

ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ అలవాటును ఆయన మార్చుకోలేకపోతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల డాక్టర్లతో సుధీర్ఘంగా జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాన్ని తప్పుపట్టలేం. కానీ ఈ కాన్ఫరెన్స్ మేథోమథానికి కాకుండా రాజకీయ ప్రయోజనాలకే ఆయన వాడేశారు. చంద్రబాబు మాటల్లో ఒక విషయం చెప్పారు. ఏపీలో పరిస్థితులపై ప్రతి ఆదివారం తాను కేంద్రానికి నివేదిక పంపుతున్నానని అన్నారు.

ఆయన నిజంగా పంపుతున్నారా… పంపినా దాన్ని చదివే తీరిక కేంద్రానికి ఉందా… అన్నది పక్కన పెడితే… ఈ విషయం చెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై తాను కేంద్రానికి పరోక్షంగా ఫిర్యాదులు పంపుతున్నానని అంగీకరించారు. ఎందుకంటే కరోనా పరిస్థితిని ఎదుర్కొనే బాధ్యత అధికంగా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. కేంద్రం పై నుంచి పరిశీలన మాత్రమే చేస్తుంది.

ఇలాంటి సమయంలో ఏపీపై చంద్రబాబుకు నిజంగానే ప్రేమ ఉన్నా, కరోనాపై సలహాలు, సూచనలు ఇవ్వాలనుకున్నా ముందుగా సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సింది. పలాన చోట లోపం ఉంది, పలాన ఆస్పత్రిలో ఇబ్బందులు ఉన్నాయి అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉంటే ఆయన ప్రజల మన్ననలు పొందేవారు. ఒకవేళ చంద్రబాబు ఇచ్చే సలహాల్లో సూచనల్లో మంచివి ఉంటే వాటిని పాటించకపోతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే విమర్శల పాలయ్యేది. అలా చేయకుండా వారం వారం కేంద్రానికి నివేదిక పంపుతున్నానని బయటకు చెప్పడం ద్వారా ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియని కరోనా విపత్తులోనూ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నది స్పష్టంగా అర్థమవుతోంది.

40ఏళ్ల ఇండస్ట్రీ ప్రజలకు ధైర్యం చెప్పాల్సింది పోయి… శుభం పలకాల్సింది పోయి ప్రతి పది సెకన్లకు ఒక మరణం నమోదయ్యే పరిస్థితి ఏపీలో ఉందని వ్యాఖ్యానించడాన్ని ఏమనుకోవాలి?. ప్రతి పది సెకన్లకు ఏపీలో ఒకరు చనిపోతారని చంద్రబాబు మాట్లాడితే.. ఈ సీనియర్ పొలిటిషియన్ నుంచి ఇంకేం ఆశించగలం?. ఇప్పటికే రెండు పత్రికలు ఏపీ ప్రజలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని నిత్యం అతి భయంకరంగా భయపెడుతూ ప్రజల్లో ఇమ్యూనిటీ పవర్‌ను కూడా కబళిస్తుంటే అది చాలదని చంద్రబాబు నాయుడు కూడా భయపెడితే ప్రజలేమైపోవాలి.

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ సహా అన్ని ప్రయత్నాలూ చేసింది ఏపీ ప్రభుత్వం. కొన్ని రాష్ట్రాలు తూతూమంత్రంగా పరీక్షలు చేస్తూ దాదాపు చేతులెత్తేశాయి. ఏపీలో మాత్రం భారీగా కేసులు నమోదు అవుతున్నా… స్కోర్‌బోర్డును చూసి భయపడకుండా పరీక్షలు రోజుకు 50వేలపైగా చేస్తూ వెళ్తుంటే అభినందించకపోయినా పర్వాలేదు. కనీసం రాళ్లు వేయకుండా ఉంటే చాలు. కరోనా కేసులు లక్ష అయినా పది లక్షలు అయినా ఇప్పటికిప్పుడు పీఠాలు మారే అవకాశం లేదు. అలాంటప్పుడు విపత్తులోనూ ప్రజల జీవితాలతో ఆడుకోవాలన్న అతృతెందుకు?. వేలాది మందికి కరోనా సోకుతుండడంతో ఆసుపత్రుల మీద, సిబ్బంది మీద ఒత్తిడి పడుతున్న మాట వాస్తవం.

అక్కడక్కడ జరగకూడనివి జరుగుతున్నాయి. వాటిని ఎత్తి చూపాల్సిందే. కానీ ఆ ఘటనలనే బూతద్దంలో పెట్టి చూపిస్తూ భయపెట్టడం సబబు కాదు. ఇప్పుడు వేలమంది బాధితులు వస్తుండడంతో ఆస్పత్రుల్లో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. కానీ సాధారణ సమయంలోనే చంద్రబాబు పాలనలో గుంటూరు జీజీహెచ్‌లో పిల్లలను ఎలుకలు కొరికిన ఉదంతాలు మరిచిపోలేం. దశాబ్దాల తరబడి ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసి, కార్పొరేట్‌కు గేట్లు ఎత్తిన వ్యవహారంలో సింహభాగం బాధ్యత చంద్రబాబుదే. ఆయన జమానాలోనే ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ఏమాత్రం ఆలోచన చేసి ఉన్నా ఇప్పుడు పని మరింత సులువు అయ్యేది.

అధికారంలో ఉన్నప్పుడు ఎంత పెద్ద రోగం వచ్చినా ఏపీ బయట ఆపరేషన్లు చేయించుకుంటే ఆరోగ్య శ్రీ వర్తింప చేయలేమని ప్రకటించిన వారే… 108 అంబులెన్స్‌లను మూలన పడుకోబెట్టిన వారే… ఇప్పుడు ఆరోగ్య రంగం గురించి ఆవేదన చెందితే ఏమనుకోవాలి.

ఉండవల్లిలో ఉండేందుకు ఇళ్లు ఉన్నా హైదరాబాద్‌లోని నివాసంలో చంద్రబాబు ఉంటున్నారు. ఆయన కనీసం కుప్పంలో సంగతి కూడా ఆరా తీస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. సీఎంగా ఓడించిన ఏపీ ప్రజలతో పాటు ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం ప్రజలపైనా ప్రేమ చూపుతున్నట్టు లేదు.

అందరికీ ఇలాంటి పక్క రాష్ట్రాల్లో క్షేమంగా ఉంటూ జూమ్‌ కాన్పరెన్స్‌లు నిర్వహించే వెసులుబాటు ఉండదు కదా. రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్యులు ప్రమాదమని తెలిసి కూడా బయటకు తిరగక తప్పని పరిస్థితి. ఆ సమయంలో వారు కరోనా బారినపడుతున్నారు. ఆ నిందించే విషయంలోనైనా నిజాయితీ ఉందా అంటే అదీ లేదు.

చంద్రబాబునాయుడే…. మోడీ గ్రేట్ అంటారు… కేసీఆర్‌పై పల్లెత్తు విమర్శ చేయరు. కేవలం జగన్‌మోహన్ రెడ్డిపై మాత్రమే బురదజల్లుతున్నారంటే దాని వెనుక ఉద్దేశం రాజకీయ లబ్ది, పదవీ వ్యామోహం, సీఎం సీట్లో మరొకరు ఉన్నారే అన్న ఆక్రోశం కాక మరేమిటి అనుకుంటున్నారు ప్రజలు.

First Published:  26 July 2020 11:06 PM GMT
Next Story