Telugu Global
International

కోవిడ్-19 తో.... మిలియనీర్లు అయిన ప్రొఫెసర్లు

ఒకవైపు కోవిడ్-19 వ్యాధికి టీకాను కనుగొనే పనిలో అనేక బృందాలు నిమగ్నమైన సమయంలోనే యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్‌కు చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు దీనికి ఒక డ్రగ్ అభివృద్ధి చేశారు. గత వారం ఈ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు ఒక్క రోజులోనే మిలియనీర్లుగా మారిపోయారు. వీరి కృషి వెనుక రెండు దశాబ్దాల కథ ఉంది. రెండు దశాబ్దాల క్రితం రాట్కో జుకనోవిచ్, డొన్నా డేవిస్, స్టీఫెన్ హోల్‌గేట్ అనే ముగ్గురు ప్రొఫెసర్లు ఆస్తమా, […]

కోవిడ్-19 తో.... మిలియనీర్లు అయిన ప్రొఫెసర్లు
X

ఒకవైపు కోవిడ్-19 వ్యాధికి టీకాను కనుగొనే పనిలో అనేక బృందాలు నిమగ్నమైన సమయంలోనే యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్‌కు చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు దీనికి ఒక డ్రగ్ అభివృద్ధి చేశారు. గత వారం ఈ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు ఒక్క రోజులోనే మిలియనీర్లుగా మారిపోయారు. వీరి కృషి వెనుక రెండు దశాబ్దాల కథ ఉంది.

రెండు దశాబ్దాల క్రితం రాట్కో జుకనోవిచ్, డొన్నా డేవిస్, స్టీఫెన్ హోల్‌గేట్ అనే ముగ్గురు ప్రొఫెసర్లు ఆస్తమా, తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులు సంభవించడానికి గల కారణాలపై విస్తృత పరిశోధనలు ప్రారంభించారు. ఇంటర్‌ఫెర్నాన్ బీటా అనే ప్రోటీన్ లోపం కారణంగా సాధారణ జలుబు వస్తున్నట్లు వీరు కనుగొన్నారు. ఆస్తమా, శ్వాస సంబంధిత రోగులకు ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు ఈ ఈ ప్రోటీన్‌ను కనుక శరీరంలో ప్రవేశపెడితే వారి వ్యాధిని నయం చేయవచ్చని నిరూపించారు. దీంతో వీరు ముగ్గురు కలసి సైనార్జీన్ అనే సంస్థను నెలకొల్పి వారి పరిశోధనలను చికిత్సగా మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

రాట్కో జుకనోవిచ్, డొన్నా డేవిస్, స్టీఫెన్ హోల్‌గేట్

ఈ సైనర్జీన్ అనే కంపెనీని 2004లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయించారు. అయితే ప్రముఖ ఫార్మా కంపెనీ ఆస్త్రాజెనెకాతో కలసి ఆస్తమా వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన చికిత్సకు సంబంధించిన డీల్ కుదరక పోవడంతో సైనర్జీన్ కంపెనీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. అయినా సరే ఆ ముగ్గురు వారి పరిశోధనలు కొనసాగిస్తూ వచ్చారు. కాగా, ప్రస్తుతం కరోనా మహమ్మారి వేళలో శ్వాస సంబంధిత చికిత్సకు డిమాండ్ పెరగడంతో వీరి పరిశోధనలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.

అప్పట్లో వాళ్లు కనిపెట్టిన ఇంటర్‌ఫెర్నాన్ బీటా డ్రగ్ కరోనా వైరస్‌పై పోరాటంలో కూడా కీలకంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు గ్రహించారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో క్లినికల్ ట్రయల్స్‌కు సిద్దపడ్డారు. కరోనా బారిన పడి బ్రిటన్ ఆసుపత్రల్లో చేరిన అనేక మంది శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కున్నారు. ఆ సమయంలోనే ఈ ప్రొఫెసర్స్ కనుగొన్న ఇంటర్‌ఫెర్నా డ్రగ్ (ఎస్ఎన్‌జీ 001)ను రోగులకు నెబ్యులైజర్ ద్వారా నేరుగా ముక్కులో ప్రవేశపెట్టారు. రెండు మూడు సార్లు ఈ ఔషధాన్ని వారికి ఇచ్చారు.

ఈ ప్రొఫెసర్లు అభివృద్ది చేసిన డ్రగ్ దాదాపు 101 మంది రోజులకు ఇవ్వగా 79 శాతం మంది తమ శ్వాస సంబంధిత సమస్యల నుంచి బయటపడ్డారు. ఈ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను గత వారం వెల్లడించారు. ఈ విషయాలను సైనర్జీన్ కంపెనీ సీఈవో రిచర్డ్ మార్స్‌డెన్ బయటపెట్టారు. ఈ ఫలితాల వివరాలు 21 జులై ఉదయం బయటకు రాగానే కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి. మధ్యాహ్నం కల్లా 540 శాతం షేరు ధర పెరగడం విశేషం. జుకనోవిచ్‌కు ఉన్న షేర్ల విలువ 3 లక్షల పౌండ్ల నుంచి 1.6 మిలియన్ పౌండ్లకు, హోల్‌గేట్, డేవీస్ షేర్ల విలువ 1.7 మిలియన్ పౌండ్లకు పెరిగాయి. ఈ ఏడాది సైనర్జీన్ షేర్ల విలువ 3వేల శాతం మేర పెరగడం గమనార్హం. వీరితో పాటు ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్లు, డైరెక్టర్లు కూడా భారీగా లాభపడ్డారు.

ఈ డ్రగ్ గురించి కంపెనీ సీఈవో మాట్లాడుతూ ‘కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా కూడా చాలా మంది నష్ట పోయారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంతో నష్టం జరుగుతుంది. మేము తయారు చేసిన డ్రగ్ ప్రస్తుతం సత్ఫలితాలనే ఇస్తున్నది. ఇది కనుక 100 శాతం వ్యాధిని నయం చేయగలిగితే మా సంస్థకే కాక ప్రపంచానికే ఒక ఆశాకిరణంగా మారుతంది’ అని అన్నారు. ప్రస్తుతం సైనర్జీన్ సంస్థ పరిశోధనలు కేవలం సౌతాంప్టన్ జనరల్ ఆసుపత్రికే పరిమితం అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మరి కొన్ని ప్రాంతాల్లో కూడా క్లినికల్ ట్రయల్స్ చేయడానికి సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. అవి కూడా విజయవంతం అయితే మార్కెట్లోకి ఈ డ్రగ్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

First Published:  27 July 2020 2:54 AM GMT
Next Story