8లక్షల ట్రాక్టర్‌ అందజేసిన సోనుసూద్… స్పూర్తి పొందిన చంద్రబాబు

ప్రముఖ నటుడు సోనుసూద్‌ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. సినిమాల్లో కరుడుగట్టిన విలన్‌లా కనిపించే సోను… నిజ జీవితంలో మాత్రం అసలైన హీరోగా నిలిచారు. సినిమా హీరోలు తెరపై మాత్రమే హీరోలు అనిపించారు. కరోనా సమయంలో వేలాది మంది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చి శభాష్ అనిపించుకున్న సోనుసూద్ … తాజాగా ఒక రైతు కుటుంబానికి ట్రాక్టర్ అందజేసి ప్రశంసలు అందుకున్నారు.

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఒక రైతు కుటుంబం సేద్యం చేసేందుకు ఎద్దులు లేక ఇద్దరు కుమార్తెల సాయంతో పొలం దున్నడం చూసి చలించినపోయిన సోనుసూద్‌… ఆ కుటుంబానికి 8 లక్షల విలువైన ట్రాక్టర్‌ను అందజేశారు. ఒక రోటావేటర్‌ను కూడా అందించారు. ఆడపిల్లలు కాడెద్దులుగా మారి పొలం దున్నిన వీడియో వైరల్ అవడంతో సోనుసూద్‌ తక్షణం స్పందించారు. వారికి సోమవారంలోగా రెండు ఎద్దులు అందిస్తానని చెప్పారు.

ఆ తర్వాత వారికి ఎద్దులు కాదు ట్రాక్టర్ ఇస్తానని ప్రకటించారు. సోమవారం సాయంత్రానికి ట్రాక్టర్ వారి పొలంలో ఉంటుందని చెప్పిన సోనుసూద్ ఆదివారమే వారి ఇంటికి ట్రాక్టర్‌ చేర్చారు. ఎనిమిది లక్షల విలువైన సోనాలిక ట్రాక్టర్‌ను, ఒక రొటావేటర్‌ను సోనాలికా కంపెనీ ప్రతినిధి మహమ్మద్‌ ఫయాజ్‌ ట్రాక్టర్‌ను రైతు నాగేశ్వరరావుకు అందజేశారు.

సోనుసూద్‌ సాయాన్ని చిత్తూరు జిల్లాకే చెందిన మాజీ మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. సోనుసూద్‌ను స్పూర్తిగా తీసుకుని రైతు కుటుంబానికి చెందిన ఇద్దరు ఆడపిల్లలను తాను చదివిస్తానని చంద్రబాబు ప్రకటించారు.