మొద్దు శీను హంతకుడు ఓంప్రకాశ్‌ మృతి

పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శీనును హత్య చేసిన ఓంప్రకాశ్‌ చనిపోయాడు. పరిటాల రవి హత్య కేసులో మొద్దు శీను అనంతపురం జిల్లా జైలులో ఉన్న సమయంలో తోటి ఖైదీ ఓంప్రకాశ్ అతడిని వ్యాయామం కోసం తయారు చేసుకున్న సిమెంట్ డంబెల్‌తో కొట్టి చంపేశాడు. 2008 నవంబర్‌9న మొద్దు శీను హత్యకు గురయ్యాడు. మొద్దు శీను హత్య కేసులో తొలుత వరంగల్‌ జైలులో ఓంప్రకాశ్‌ను ఉంచారు.

ఆ తర్వాత నెల్లూరు జైలుకు తరలించారు. ఇతడికి కిడ్నీలు పాడైపోవడంతో 11 ఏళ్లుగా డయాలసిస్‌ చేయిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం నెల్లూరు జైలు నుంచి విశాఖ జైలుకు ఇతడిని తరలించారు. శనివారం కేజీహెచ్‌లో డయాలసిస్ చేయించారు. ఆదివారం ఉదయం శ్వాసపీల్చుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పడంతో కేజీహెచ్‌కు తిరిగి పంపించారు. ఆస్పత్రికి వెళ్లే లోపే ఓంప్రకాశ్ చనిపోయాడు.

సిమెంట్‌ లారీని దోపిడి చేసి డ్రైవర్, క్లీనర్‌ను హత్య చేసిన కేసులో ఓంప్రకాశ్‌ తొలుత అరెస్ట్ అయ్యాడు. ఆ కేసులో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మొద్దు శీనును చంపేశాడు.