ప్రభాస్ సినిమాకు హీరోయిన్ కష్టాలు

అందరి హీరోల సినిమాల్లానే ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ కూడా లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. అన్ లాక్ లో భాగంగా మిగతా హీరోలంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు సెట్స్ పైకి రావొచ్చు. కానీ ప్రభాస్ మూవీకి ఆ వెసులుబాటు లేదు. ఎందుకంటే, ప్రభాస్ అందుబాటులో ఉన్నప్పటికీ, హీరోయిన్ పూజాహెగ్డే ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారింది.

ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఉంది. షూటింగ్ చివరి స్టేజీలో ఉన్న ఈ సినిమాను ఆమె పూర్తిచేయాల్సి ఉంది. దీంతో పాటు అటు బాలీవుడ్ లో సల్మాన్ సినిమాకు ఆమె కాల్షీట్లు కేటాయించింది. ఈ రెండు సినిమాలతో పాటు రాధేశ్యామ్ కు ఆమె డేట్స్ ఇవ్వాల్సి ఉంది.

కానీ రాధేశ్యామ్ సినిమా మిగతా 2 సినిమాల్లాంటిది కాదు. ఈ సినిమాకు పూజా హెగ్డే బల్క్ డేట్స్ కావాలి. ప్రభాస్-పూజా కాంబినేషన్ సీన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. పైగా విదేశాల్లో షూటింగ్. కాబట్టి ఆమె ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

అక్టోబర్ నుంచి రాధేశ్యామ్ ను తిరిగి పట్టాలపైకి తీసుకురావాలనేది ప్లాన్. అప్పట్నుంచి ఏకథాటిగా షూటింగ్ చేసి, వచ్చే ఏడాది సమ్మర్ కు సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ అనుకుంటున్నారు. ఈ ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టు అమలవ్వాలంటే పూజా హెగ్డే బల్క్ డేట్స్ తప్పనిసరి.