పండగ మిస్ చేసుకున్న వకీల్ సాబ్

పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ సంక్రాంతికి వస్తుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే సినిమా షూటింగ్ వర్క్ చాలా తక్కువగా ఉంది. వచ్చే ఏడాది జనవరి నాటికి వద్దన్నా రెడీ అయిపోతుంది. కాబట్టి అదే పెర్ ఫెక్ట్ డేట్ అనుకున్నాడు దిల్ రాజు. ఫ్యాన్స్ కూడా సంక్రాంతికి రీఎంట్రీ మూవీ అనేసరికి హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఇప్పుడు ప్లాన్స్ వర్కవుట్ అయ్యేలా లేవు.

తాజాగా పవన్ కల్యాణ్ తన సినిమాల గురించి మాట్లాడాడు. వాక్సీన్ వచ్చేవరకు తిరిగి షూటింగ్ మొదలుపెట్టేది లేదని స్పష్టంగా చెప్పేశాడు. అంటే వకీల్ సాబ్ పెండింగ్ పార్ట్ షూటింగ్ ఇప్పట్లో పూర్తవ్వదని అర్థం. దీనికి మరింత ఊతమిస్తూ.. నితిన్ తన సినిమాను సంక్రాంతికి రెడీ చేశాడు.

రీసెంట్ గా రంగ్ దే టీజర్ రిలీజైంది. సంక్రాంతికి వస్తున్నామంటూ ఆ టీజర్ లోనే ప్రకటించారు. నిజంగా వకీల్ సాబ్ సంక్రాంతి రేసులో ఉంటే, నితిన్ ఇంత సాహసం చేయడు. పవన్ సినిమాకే పోటీగా వెళ్లేంత మూర్ఖత్వం చూపించదు. కచ్చితంగా వకీల్ సాబ్ యూనిట్ నుంచి వాళ్లకు స్పష్టమైన సందేశం/సంకేతం అంది ఉంటుంది. అందుకే నితిన్ తన సినిమా సంక్రాంతికి వస్తుందని ప్రకటించాడు. సో.. వకీల్ సాబ్ సంక్రాంతి పండగను మిస్ అయినట్టే.