అంతా సెట్ అయినట్టేనా మహేషూ!

ఈమధ్య ఎందుకో మహేష్ బాబుకు, దర్శకులకు సరిగ్గా పొసగడం లేదు. త్రివిక్రమ్-మహేష్ మధ్య వ్యవహారం చాన్నాళ్ల కిందటే చెడింది. రీసెంట్ గా మహేష్-సుకుమార్ మధ్య బంధం తెగింది. ఈ రెండింటి మధ్య వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు కూడా మహేష్ వల్ల హర్ట్ అయిన వాళ్లు ఉన్నారు. అయితే సున్నితంగా మారిన ఈ బంధాల్లోంచి ఓ బాండింగ్ ను తాజాగా బలపరుచుకున్నాడు మహేష్.

వంశీ పైడిపల్లి పుట్టినరోజు జరిగింది. ఈ పుట్టినరోజు సందర్భంగా పైడిపల్లికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు మహేష్. తను చెప్పడమే కాదు… తన భార్య నమ్రతతో కూడా ట్వీట్ పెట్టించాడు. వంశీ పైడిపల్లికి మహేష్ విశెష్ చెబితే అందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా?

కొన్ని నెలల కిందట మహేష్ కు ఓ కథ చెప్పాడు వంశీ పైడిపల్లి. కానీ మహేష్ మాత్రం ఆ స్టోరీకి నో చెప్పాడు. కథ బాగా లేదని తిప్పికొట్టాడు. అప్పట్నుంచి వీళ్లిద్దరి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయంటూ చాలా పుకార్లు వచ్చాయి. ఆ పుకార్లకు ఇప్పుడు తాజాగా ఫుల్ స్టాప్ పడింది.

స్వయంగా మహేష్, వంశీ పైడిపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో వీళ్లిద్దరి మధ్య గొడవలేం లేవనే విషయం అందరికీ తెలిసింది. ఇదే విధంగా సుకుమార్ కు కూడా మహేష్, సందర్భాన్ని బట్టి శుభాకాంక్షలు చెబితే ఓ పనైపోతుందంటున్నారు సినీజనాలు.