చంద్రబాబు అవకాశవాద రాజకీయంపై ఓమర్ ఫైర్

జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడి అవకాశవాద రాజకీయాలపై విమర్శలు చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు తరపున ఓమర్ అబ్దుల్లా తండ్రి… ఫరూక్ అబ్దుల్లా ప్రచారం చేయడానికి ఏపీ వచ్చారు.

మండుటెండలో చంద్రబాబు కోసం ఫరూక్‌ ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. ఎన్నికల ముందు వరకు బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను రెచ్చగొట్టిన చంద్రబాబునాయుడు ఎన్నికలు అయిపోగానే తిరిగి బీజేపీ అనుకూల రాగం అందుకున్నారు.

ఆర్టికల్ 370రద్దు సందర్భంగా ఫరూక్ అబ్దుల్లాను, ఆయన కుటుంబసభ్యులను చాలాకాలం నిర్బంధించినా చంద్రబాబు కనీసం మాట మాట్లాడలేదు. సానుభూతి కూడా తెలపలేదు. ఇదే అంశాన్ని ఓమర్ అబ్దుల్లా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతోందని… జగన్‌మోహన్ రెడ్డి మొత్తం ఆక్రమించబోతున్నారన్నది అందరికీ తెలుసని.. అలాంటి సమయంలో కూడా తన తండ్రి సొంత పార్లమెంట్ ఎన్నికలను పక్కన పెట్టి ఏపీకి వెళ్లి చంద్రబాబు కోసం ప్రచారం చేశారని గుర్తు చేసుకున్నారు.

అలాంటిది తాము ఇబ్బందుల్లో ఉనప్పుడు మాత్రం చంద్రబాబు కనీసం మద్దతుగా ఒక మాట కూడా మాట్లాడలేదని ఓమర్ అబ్దుల్లా ఆవేదన చెందారు. పరోక్షంగా చంద్రబాబు పచ్చి అవకాశవాది అని ఓమర్ తేల్చేశారు.