అమ్మే చంపమంది…చంపేశా !

అనారోగ్యంతో బాధపడుతున్న కన్నతల్లిని గొంతుకోసి హత్యచేశాడు ఓ కొడుకు. ఆమె బాధలను తప్పించడానికే ఆ పనిచేశానంటున్నాడు అతను. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో శ్రీ పెరంబుదూర్ పట్టణంలో ఈ దారుణం జరిగింది. హత్యకు గురయిన మహిళ పేరు గోవిందమ్మాళ్. వయసు 66. ఆమె కొడుకు ఆనంద్ (36) తన తల్లిని గొంతుకోసి హత్య చేశాడు. హత్య జరిగిన సమయంలో గోవిందమ్మాళ్ కుమార్తె పక్కింటికి వెళ్లింది. బయటకు వెళ్లిన భర్త ఇంటికి వచ్చేసరికి గోవిందమ్మాళ్ రక్తపు మడుగులో కనిపించింది.  అనారోగ్యంతో బాధపడుతున్న తల్లే తన ప్రాణాలు తీయాల్సిందిగా ప్రాధేయపడిందని ఆనంద్ పోలీసుల విచారణలో తెలిపాడు.

గోవిందమ్మాళ్ కుటుంబం రజక వృత్తితో జీవనం సాగిస్తోంది. గత ఫిబ్రవరి నెలలో ఆమెకు క్షయ, మధుమేహం ఉన్నట్టుగా తేలటంతో ప్రభుత్వ హాస్పటల్ లో చికిత్స తీసుకుంది. ఈ నెల మొదటివారంలో హాస్పటల్ నుండి ఇంటికి వచ్చింది.

అయితే ఆమెకు పూర్తిస్థాయిలో స్వస్థత రాకపోవటంతో… ఈ బాధలు భరించలేనంటూ తనను చంపేయాల్సిందిగా ప్రాధేయపడిందని, హాస్పటల్ కి తీసుకుని వెళ్లినా తనకు బాగవుతుందనే నమ్మకం ఆమెకు లేదని… ఆనంద్ పోలీసుల విచారణలో తెలిపాడు. తల్లి బాధ చూడలేకే చంపేశానని అతను పేర్కొన్నాడు.

గోవిందమ్మాళ్ కుటుంబం పేదరికంలో ఉన్నదని, లాక్ డౌన్ కారణంగా వారు తమ ఉపాధిని కూడా కోల్పోవటంతో ఆమె వైద్య ఖర్చులకు సైతం డబ్బులేని పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు హత్యానేరంపై ఆనంద్ ని అరెస్టు చేశారు.