ఎట్టకేలకు ఎమ్మెల్యేలకు జగన్ అపాయింట్ మెంట్…

రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేల కల నెరవేరబోతోంది. అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇంతవరకు సీఎం జగన్ వారికి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. సమీక్షలైనా, సమావేశాలైనా మంత్రులు, అధికారులతోనే. వీడియో కాన్ఫరెన్సుల్లో ఎమ్మెల్యేలు కనిపించినా స్థానిక సమస్యలు, రాజకీయాలు ఆయన దృష్టికి తీసుకెళ్లలేని పరిస్థితి. అందుకే చాలామంది ఎమ్మెల్యేలు సీఎంపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం.

అయితే త్వరలో వీరందరి కల నెరవేరబోతోంది. రచ్చబండ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు, స్థానిక నాయకత్వాన్ని వ్యక్తిగతంగా కలవబోతున్నారు సీఎం జగన్. రచ్చబండ కార్యక్రమం ప్రజల సమస్యలు తెలుసునేందుకు డిజైన్ చేసినా, జగన్ ఐడియా వేరేగా ఉందట. ఎమ్మెల్యేలను వారి వారి నియోజకవర్గాల్లోనే కలసి, సమస్యలను చర్చించి, అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపించడం ద్వారా వారికి మరింత భరోసా కల్పించే ఉద్దేశంలో ఉన్నారట జగన్.

అందుకే కరోనా ప్రభావం తగ్గాక వెంటనే రచ్చబండ మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తయిన వెంటనే రచ్చబండ మొదలు కావాల్సి ఉన్నా.. కరోనా వల్ల అది లేటయింది. ఈలోపుగా ఎమ్మెల్యేలలో కూడా చాలామంది తమకి సీఎంని కలిసే అవకాశం రాలేదంటూ అసంతృప్తితో ఉన్నారు. వీరందరినీ శాంతింపజేసేందుకు, స్థానిక సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించేందుకు సీఎం జగన్ పర్యటన పెట్టుకున్నారు.

ఎన్నికల సందర్భంలో చేసిన పాదయాత్ర తరాహాలోనే అన్ని ప్రాంతాలను సీఎం కవర్ చేస్తారట. రోజుకి రెండు మూడు నియోజకవర్గాలు ప్లాన్ చేసుకుంటూ… రెండు నెలల వ్యవధిలో.. అందర్నీ కవర్ చేసే ఉద్దేశంలో ఉన్నారట జగన్. లేదా జిల్లాకి ఓరోజు పూర్తిగా కేటాయించి రచ్చబండ జరిగే ఊరికే అందరు ఎమ్మెల్యేలను రప్పించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందట.

మొత్తమ్మీద ఇప్పటికే ఒకరిద్దరిలో బైటపడిన అసంతృప్తిని అలా చల్లార్చేందుకు పథక రచన చేశారు జగన్. రచ్చబండ ద్వారా ప్రజల్లో తన పాలన సమీక్షించుకోవడంతోపాటు.. ప్రజా ప్రతినిధుల పనితీరు కూడా అంచనా వేసేందుకు సిద్ధమవుతున్నారు జగన్.