‘ఎన్ని హత్యలు చేశానో లెక్కపెట్టలేదు’!

ఒక సీరియల్ కిల్లర్ పోలీసులకు ఇదే సమాధానం చెప్పాడు. యాభై హత్యల వరకు లెక్కపెట్టాను. కానీ తరువాత ఎన్ని హత్యలు చేశానో లెక్క పెట్టుకోలేదని చెప్పాడతను. ఢిల్లీలోని బప్రోలా అనే ప్రాంతంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. జైలు శిక్షని అనుభవిస్తూ పెరోల్ పై బయటకు వచ్చి తిరిగి జైలుకి వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతున్న ఆ ఖైదీని పోలీసులు పట్టుకున్నారు.

ఆ సీరియల్ కిల్లర్ పేరు దేవేందర్ శర్మ. వయసు 62 ఏళ్లు. ఆయుర్వేదంలో డాక్టరు డిగ్రీ ఉంది అతనికి. ఢిల్లీలోనూ ఇతర పొరుగు రాష్ట్రాల్లోనూ యాభైకి పైగా ట్రక్, టాక్సీ డ్రైవర్ల హత్యల్లో అతని  ప్రమేయం ఉందని పోలీసులు వెల్లడించారు.  నిజానికి వందకుపైగా హత్య కేసుల్లో శర్మకు సంబంధం ఉందని, అతనిపై ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ ల్లో కేసులు నమోదు కావటం వలన ఖచ్ఛితంగా లెక్క చెప్పలేమని పోలీసులు తెలిపారు.

శర్మ ఉత్తర ప్రదేశ్ లోని అలీఘర్ జిల్లా పుర్రేనీ గ్రామానికి చెందినవాడు. తను చేసిన కొన్ని హత్యలు రుజువై శిక్షని అనుభవిస్తూ… ఆరునెలల క్రితం పెరోల్ పై బయటకు వచ్చిన శర్మ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడి కోసం గాలించి అరెస్టు చేశారు. శర్మపై పలు హత్యా, కిడ్నాప్ కేసులున్నాయని పోలీసులు తెలిపారు. ఇంతకుముందు ఉత్తర ప్రదేశ్లో నకిలీ గ్యాస్ ఏజన్సీ నడిపినందుకు, వివిధ రాష్ట్రాల్లో అక్రమంగా మూత్రపిండాలను అమ్మకాలు జరిపిన కేసుల్లో కూడా అతను అరెస్టయి జైలుకి వెళ్లి ఉన్నాడు.

ప్రస్తుతం శర్మ జైపూర్ సెంట్రల్ జైల్లో హత్యా నేరానికి యావజ్జీవ ఖైదు అనుభవిస్తున్నాడు. పదహారేళ్లు జైలు శిక్షని పూర్తి చేసుకున్న అనంతరం గత జనవరిలో అతనికి ఇరవైరోజులపాటు పెరోల్ సెలవు లభించింది. అయితే ఆ సెలవు అనంతరం జైలుకి వెళ్లకుండా తప్పించుకుని కొన్నాళ్లపాటు తన సొంత ఊళ్లో ఉన్నాడు. తరువాత ఢిల్లీ చేరుకున్నాడు. మార్చిలో ఢిల్లీకి చేరుకున్న శర్మ కొంతకాలం ఒక బంధువు ఇంట్లో తలదాచుకుని తరువాత ఒక వితంతువుని వివాహం చేసుకున్నాడు.  ప్రాపర్టీ బిజినెస్ లో మధ్య వర్తిగా వ్యవహరిస్తూ జీవనం సాగిస్తున్నాడు.  తమకు అతని జాడపై సమాచారం అందటంతో అరెస్టు చేశామని  ఢిల్లీ పోలీసులు తెలిపారు.

మంగళవారం శర్మని అరెస్టు చేసిన పోలీసులు బుధవారం ఉదయం వరకు అతడిని విచారించాడు. అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడని, తమకు సహకరిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. 2002-2004 మధ్య అనేక హత్యలు చేశాడనే అభియోగాలు తనపై ఉన్నా ఆరు, ఏడు కేసుల్లో మాత్రమే అతడు దోషి అని కోర్టులో తేలింది. యాభై హత్యల తరువాత ఎన్ని హత్యలు చేసి ఉంటానో లెక్కపెట్టలేదని శర్మ పోలీసులకు తెలిపాడు.  2004లోనే శర్మ భార్యాపిల్లలు అతడిని వదిలేసి వెళ్లిపోయారు.

ఇక అతని గురించిన పూర్వపు వివరాల్లోకి వెళితే… శర్మ 1984లో ఆయుర్వేద వైద్యునిగా జైపూర్ లో క్లినిక్ మొదలుపెట్టాడు. 1992లో వంట గ్యాస్ డీలర్ షిప్ తీసుకున్నాడు. అందులో 11 లక్షల పెట్టుబడి పెట్టాడు. అయితే  కొంతమంది వ్యక్తులు మోసం చేయటంతో డబ్బు మొత్తం పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తరువాత నకిలీ గ్యాస్ ఏజన్సీని మొదలు పెట్టాడు. అలాగే కొన్ని రాష్ట్రాల అనుసంధానంతో సాగిన కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ రాకెట్ లో కూడా చేరి అక్రమాలకు పాల్పడ్డాడు. 2004లో శర్మతో పాటు అనేకమంది డాక్టర్లు గుర్ గావ్ కిడ్నీ రాకెట్ కేసులో అరెస్టయినట్టుగా పోలీసులు వెల్లడించారు. 1994 -2004 మధ్యకాలంలో 125 అక్రమ కిడ్నీ మార్పిడుల్లో తన పాత్ర ఉందని, ఒక్కో కేసుకి తనకు అయిదునుండి ఏడు లక్షల వరకు డబ్బు లభించిందని శర్మ పోలీసులకు తెలిపాడు.

2004 కి ముందు… ఉత్తర ప్రదేశ్లోని అమ్రోహాలో 2001లో నకిలీ గ్యాస్ ఏజన్సీని నడుపుతున్నందుకు అరెస్టయ్యాడు. తరువాత జైపూర్లో మళ్లీ క్లినిక్ మొదలుపెట్టి 2003 వరకు నడిపాడు. ఈ సమయంలోనే హత్యల్లో తనతో పాలుపంచుకున్న వ్యక్తులతో శర్మకు పరిచయం అయ్యింది. వీరు అలీఘర్ నుండి ట్యాక్సీని మాట్లాడుకుని నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్లాక డ్రైవర్ ని హత్య చేసేవారు. కాష్ గంజ్ లోని మొసళ్లు తిరిగే హజారా కెనాల్ లో శవాలను పడేసేవారు. తరువాత టాక్సీలను అమ్ముకునేవారు. ఎల్ పిజి గ్యాస్ సిలిండర్లు ఉన్న ట్రక్కులను సైతం డ్రైవర్లను చంపేసి దొంగతనం చేసేవారు. ట్రక్ ని శర్మ నడిపే నకిలీ గ్యాస్ ఏజన్సీ స్థావరంలో అన్ లోడ్ చేసి ట్రక్ ని మీరట్ లో పగులగొట్టేవారు. అలావీరు వంద వరకు ట్యాక్సీ, ట్రక్ డ్రైవర్ల హత్యలు చేశారు.