సుశాంత్ కేసులో మరో ట్విస్ట్

ఊహించని విధంగా సుశాంత్ ఆత్మహత్య కేసు కొత్త మలుపు తీసుకుంది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్
రియా చక్రవర్తిపై అందరి దృష్టి పడింది. దీనికి కారణం సుశాంత్ తండ్రి కేకే సింగ్, ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే. అయితే రియా చక్రవర్తిపై కేసు నమోదైన వెంటనే పరిణామాలు వెంటవెంటనే మారిపోయాయి.

తనపై పాట్నాలో కేసు నమోదైందనే విషయం తెలుసుకున్న వెంటనే రియా చక్రవర్తి సుప్రీంకోర్ట్ ను ఆశ్రయించింది. పాట్నాలో నమోదైన కేసును ముంబయి పోలీసులకు అప్పగించాల్సిందా ఆమె అభ్యర్థించింది. ఇలా చేయడం వల్ల తనకు సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపింది. పైగా సుశాంత్ మరణంపై ఎక్కువ అవగాహన ముంబయి పోలీసులకు మాత్రమే ఉందని, కాబట్టి పాట్నాలో తనపై నమోదైన కేసును ముంబయికి షిఫ్ట్ చేస్తే తను పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని ఆమె తెలిపింది.

మరోవైపు పాట్నాలో రియాపై నమోదైన కేసుకు సంబంధించి అసలు విషయం బయటకు పొక్కింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి సరిగ్గా 6 రోజుల ముందు, అతడి ఎకౌంట్ నుంచి రియా చక్రవర్తి ఎకౌంట్ కు ఏకంగా 15 కోట్ల రూపాయలు ట్రాన్సఫర్ అయిందట. దీనిపై సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేశాడు. అంత మొత్తాన్ని సుశాంత్, రియాకు ఇష్టపూర్వకంగా ఇచ్చాడా లేక బలవంతంగా ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారా అనేది తేలాల్సి ఉంది.

ఇక్కడే మరో కొత్త కోణం కూడా బయటపడింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి వారం రోజుల ముందు రియా అదే ఫ్లాట్ లో ఉందట. సరిగ్గా ఆత్మహత్యకు 6 రోజుల ముందు ఆమె ఫ్లాట్ ఖాళీ చేసిందట. అదే సమయంలో నగదు బదిలీ అవ్వడంతో పాటు భారీగా బంగారు ఆభరణాల్ని కూడా ఆమె తీసుకెళ్లిందనేది సుశాంత్ కుటుంబీకుల ఆరోపణ.