ప్లాస్మా దాతలకు ఐదు వేల నగదు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న వారిని బతికించేందుకు ప్లాస్మా థెరపీని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్లాస్మా థెరపీపై ప్రజలకు అవగాహన కల్పించడం చాలా అవసరమని ముఖ్యమంత్రి సీఎం వ్యాఖ్యానించారు. ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చే వారికి 5వేల రూపాయల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కరోనా పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి… మరికొన్ని రోజుల పాటు ప్రభుత్వ యంత్రాంగం చురుగ్గా పనిచేయాలని సూచించారు.

అత్యవసర మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కోసం గుర్తించిన ఆస్పత్రుల్లో బెడ్ల ఖాళీలు, భర్తీల వివరాలను ఆస్పత్రి హెల్ప్‌ డెస్క్‌లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రతి ఆస్పత్రిలో బ్లాక్ బోర్డు ఏర్పాటు చేసి బెడ్ల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ సదరు ఆస్పత్రిలో బెడ్లు అందుబాటులో లేకుంటే సమీప ఆస్పత్రిలో అలాట్ చేయించి అక్కడికి పంపాలని ఆదేశించారు.

హెల్ప్ డెస్క్‌లలో ఆరోగ్య మిత్రలను ఉంచాలని… హెల్ప్ డెస్క్‌ చురుగ్గా, ప్రభావవంతంగా పనిచేస్తే చాలా సమస్యలకు పరిష్కారం ఉంటుందని సీఎం వ్యాఖ్యానించారు. బెడ్లు, వైద్యం, ఫుడ్, శానిటేషన్‌ బాగుందా లేదా అన్నదానిపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కిందిస్థాయిలో పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. కోవిడ్‌ కోసం నిర్దేశించిన 138 ఆస్పత్రుల నిర్వహణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

జీజీహెచ్‌ లాంటి కీలకమైన ఆస్పత్రుల్లో చురుకైన సిబ్బందిని ఉంచాలని… ఈ అంశంపై జాయింట్ కలెక్టర్లు ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. కాల్‌ సెంటర్లు సరిగా పనిచేస్తున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిశీలించాలని సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. కరోనాపై ఇంతగా పోరాటం చేస్తున్నా కొందరు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని… వాటిని ఎప్పటికప్పుడు ఖండించాలని సూచించారు. ఒకవేళ కథనాల్లో వాస్తవం ఉంటే ఆ కథనాలను పాజిటివ్‌గా తీసుకుని పనిచేయాలన్నారు.