బాబు బిల్డప్‌పై సోము సెటైర్లు

ఏపీ బీజేపీ అధ్యక్షుడి పదవి నుంచి కన్నా లక్ష్మీనారాయణను తొలగించడాన్ని టీడీపీ, ఆ పార్టీ అనుబంధ మీడియా జీర్ణించుకోలేకపోతోంది. పైగా తన టార్గెట్ టీడీపీనే అని సోము వీర్రాజు ప్రకటించడంతో టీడీపీ మీడియా నిరసన తెలుపుతోంది.

సోము వీర్రాజు మాత్రం ఈసారి టీడీపీతో తేల్చుకుంటామని చెబుతున్నారు. బీజేపీతో టీడీపీకి మంచి సంబంధాలున్నాయని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని సోమువీర్రాజు విమర్శించారు. చంద్రబాబుకు ఏదో ఫోన్ రాగానే… అమిత్‌ షా నుంచి కాల్ వస్తోందంటూ లోపలికి వెళ్లిపోతున్నారట… అని ఎద్దేవా చేశారు. బీజేపీ చంద్రబాబుకు దగ్గరవుతోందని నమ్మించేందుకు చంద్రబాబు ఈ తరహా ప్రయత్నం చేస్తున్నారని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

అమరావతి శంకుస్థాపనకు వచ్చి రిబ్బన్ కట్ చేయాలని కోరితే ప్రధాని మోడీ వచ్చారని.. ఆ మాత్రానికి టీడీపీ ఏం చేసినా దాన్ని సమర్ధించడం బీజేపీ పని కాదని ప్రకటించారు. చంద్రబాబు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నట్టేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు సైకిల్ తొక్కే ఓపిక ఇక లేదన్నారు. యూపీలో ములాయం సింగ్ యాదవ్‌లా చంద్రబాబు క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారని జీవీఎల్ అభిప్రాయపడ్డారు.