అమరావతి కోసం చంద్రబాబు ఉప ఎన్నికలకు వెళ్లాలి – కొడాలి నాని సవాల్

అభివృద్ది మొత్తం ఒకేచోట కేంద్రీకరిస్తే ఇతర ప్రాంతాల్లో అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు మంత్రి కొడాలి నాని. అది మరోసారి విభజన ఉద్యమాలకు దారి తీయవచ్చన్నారు. అమరావతిలో పెట్టే ఖర్చులో 10 శాతం ఖర్చు పెట్టినా విశాఖ మరో మహానగరంగా మారుతుందన్నారు. నగరాలను నిర్మించేందుకు లక్ష కోట్లు ఖర్చు పెట్టడం సరికాదన్నారు. వాస్తవానికి దగ్గరగా ఆలోచించే జగన్‌మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు.

కర్నూలు జిల్లా వాళ్లు ఒకప్పుడు రాజధానినే త్యాగం చేశారని… అలాంటి వారు హైకోర్టు ఇవ్వండి అని చిన్న కోరిక కోరితే దాన్ని కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదన్నారు. దాని వల్లే రాయలసీమలో టీడీపీని ప్రజలు చిత్తు చేశారన్నారు. ఇంకా సిగ్గులేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోటలా ఉండేదని… చంద్రబాబు చేసిన పిచ్చి తుగ్లక్ చర్యల వల్లే ఉత్తరాంధ్రలో కూడా టీడీపీ మట్టికొట్టుకుపోయిందన్నారు.

చివరకు గ్రాఫిక్స్ బొమ్మలతో చేస్తున్న మోసాన్ని గుర్తించే గుంటూరు, కృష్ణాజిల్లా ప్రజలు కూడా చంద్రబాబు మూతిపళ్లు రాలగొట్టారన్నారు. సిగ్గులేకుండా జూమ్‌లో మీడియా సమావేశం పెట్టి తన ప్రెస్‌మీట్‌ ప్రపంచంలో నిలిచిపోతుందని సొల్లు కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

ముక్కు మొహం లేని వెధవలంతా టీవీ చానళ్ల ముందుకు వచ్చి వైసీపీ వాళ్లంతా రాజీనామా చేయాలని చెబుతున్నారని… దమ్ముంటే చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని ప్రజలనుకుంటున్నారని నిరూపించు అని సవాల్ చేశారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ లు ఉప ఎన్నికలకు వెళ్లి సత్తా చూపించారని… చంద్రబాబుకు కూడా దమ్ముంటే అదే పనిచేయాలన్నారు.

ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యేలంతా తిరిగి గెలిచి వస్తే మూడు రాజధానులపై ప్రభుత్వం తప్పకుండా మనసు మార్చుకుంటుందన్నారు. అమరావతి రైతుల మీద చంద్రబాబుకు ప్రేమ ఉంటే… సిగ్గు శరం ఉంటే జూమ్‌లో తప్పడి మూతి వేసుకుని సొల్లు కబుర్లు చెప్పడం మానేసి టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని చాలెంజ్ చేశారు.

అమరావతి రైతులు చంద్రబాబు మాటలు వినే మోసపోయారని… చంద్రబాబు ఇప్పటి వరకు ఉప ఎన్నికలు ఎదుర్కొన్న దమ్ము, ధైర్యం ఉన్న వ్యక్తి కాదని… ఈసారైనా అమరావతి రైతుల కోసం రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లి జీవితంలో ఒకసారైనా మగాడు అనిపించుకోవాలని కొడాలి నాని సూచించారు. ఆల్‌ బోగస్‌ చానల్‌, పాయింట్‌ ఫైవ్‌ ఛానల్‌తో బోగస్‌ ప్రచారం మానుకుని ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.