మరో సినిమా ప్రకటించిన నిఖిల్

కొత్తగా పెళ్లయింది. మరోవైపు సినిమా షూటింగ్స్ లేవు. దీంతో నిఖిల్ ఫుల్ గా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ హీరో మాత్రం తన సినిమాల పనులతోనే బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 2 సినిమాలు ఎనౌన్స్ చేసిన ఈ యంగ్ హీరో, తాజాగా మరో సినిమా ప్రకటించాడు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణ్ దాస్ నారంగ్ నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నాడు నిఖిల్. కెరీర్ లో ఇతడికి ఇది ప్రతిష్టాత్మక 20వ సినిమా. ప్రస్తుతం ఈ బ్యానర్ పై నాగచైతన్య హీరోగా లవ్ స్టోరీ సినిమా తెరకెక్కుతోంది. అది కంప్లీట్ అయిన వెంటనే నిఖిల్ సినిమాపై క్లారిటీ వస్తుంది.

నిఖిల్ చేతిలో ఆల్రెడీ 2 సినిమాలున్నాయి. లాక్ డౌన్ కు కొన్ని రోజుల ముందు కార్తికేయ-2 సినిమాను లాంఛ్ చేశాడు. మరోవైపు గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై 18 పేజెస్ అనే సినిమాను కూడా లాంఛ్ చేశాడు. వీటిలో ముందుగా 18 పేజెస్ సెట్స్ పైకి వస్తుంది. ఆ తర్వాత కార్తికేయ-2 మొదలవుతుంది. ఈ రెండు సినిమాల మధ్యలో నారాయణ్ దాస్ నారంగ్ మూవీని పట్టాలపైకి తీసుకురావాలనేది నిఖిల్ ప్లాన్. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే విషయాన్ని నిఖిల్ ఇంకా వెల్లడించలేదు.