అడకత్తెరలో పవన్ కల్యాణ్… ఇంతకీ పవన్ ఏం చెప్పాలనుకున్నారు ?

పవన్ కల్యాణ్.. చంద్రబాబు కీ ఇచ్చి ఆడించే బొమ్మే కానీ, కొన్ని సందర్భాల్లో మిత్ర పక్షం బీజేపీకి వీర విధేయత చూపించాల్సిన అవసరం కూడా ఆయనకి ఉంటుంది.

తాజాగా అదే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు జనసేనాని. మూడు రాజధానులపై గవర్నర్ ఆమోదముద్ర వేసిన సందర్భంలో పవన్ కల్యాణ్ ఎలా స్పందించాలో తెలియక ఇబ్బంది పడ్డారు. కరోనా కష్టకాలంలో మూడు రాజధానుల నిర్ణయం అమలు చేయడం ఎందుకంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన జనసేనాని.. రైతుల పక్షాన నిలబడతానంటూ కొత్త లాజిక్ తీశారు.

మూడు రాజధానుల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంపై ఎగిరెగిరి పడాలనేది పవన్ అభిమతం. టీడీపీ కూడా పవన్ ని, రైతులను అడ్డం పెట్టుకుని మరికొన్నాళ్లు డ్రామాలు ఆడాలనే దురాలోచనలో ఉంది. అయితే అప్పటికే అమరావతి విషయంలో సుజనా చౌదరికి బీజేపీ అధిష్టానం తలంటింది. రాష్ట్ర నాయకత్వంతో ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు అధికారికంగా ప్రకటన విడుదల చేయించింది. మూడు రాజధానుల అంశానికి కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని, అది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని తేల్చి చెప్పింది.

దీంతో పవన్ కల్యాణ్ కాస్త వెనక్కి తగ్గారు. ఎక్కువ మాట్లాడితే సుజనా చౌదరికి దక్కిన మర్యాదే తనకూ దక్కుతుంది, అసలు మాట్లాడకపోతే అమరావతి రైతుల పేరుతో చంద్రబాబు విమర్శలు చేయించక మానరు.

అందుకే రైతుల పక్షాన నిలబడతా, తుదికంటూ పోరాడతానంటూ ఏదేదో మాట్లాడారు పవన్ కల్యాణ్. గతంలోనే తాను 33వేల ఎకరాల్లో రాజధాని వద్దని చెప్పానని.. సమగ్రంగా అభివృద్ధి చేయాలే కానీ, రైతుల్ని మోసం చేయకూడదంటూ చెప్పుకొచ్చారు. గతంలో అమరావతి రైతుల పక్షాన ఛలో తుళ్లూరు అంటూ రోడ్డుపై కూర్చుని పోలీసుల్ని అడ్డుకుని నానా యాగీ చేశారు పవన్ కల్యాణ్. ఆ ఆవేశం అంతా ఇప్పుడు పూర్తిగా చల్లారింది.