కరోనాతో బీజేపీ నేత మాణిక్యాలరావు మృతి

బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతిచెందారు. ఆయన వయస్సు 59 ఏళ్లు. మాణిక్యాల రావుకు భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు ఉన్నారు. నెలరోజుల కిందట ఆయనకు కరోనా సోకింది. మొదట హోం క్వారంటైన్‌లో ఉన్న ఆయన తర్వాత ఏలూరు కరోనా ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం రోజుల కిందటే విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతిచెందారు.

తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని ఆయన వీడియో ద్వారా ప్రకటించారు. జూలై 4న ఓ వీడియో విడుదల చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

హైబీపీ, ఇతర సమస్యలు పెరగడంతోనే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు.

1961 నవంబర్‌ 1న తాడేపల్లిగూడెంలో పుట్టిన ఆయన అక్కడే ప్రాథమిక విద్యనభ్యసించారు. 9 ఏళ్ల వయస్సులోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతారు. తాడేపల్లిగూడెంలో వివిధ వ్యాపారాలు చేసిన ఆయన 2014లో తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 నుంచి 2018 వరకు దేవదాయ,ధర్మాదాయ శాఖమంత్రిగా పనిచేశారు.