రెఫరెండం… ఎన్నికలు… బాబు ప్రవచనాలు…

చంద్రబాబు అధికార దాహం ఎలా ఉందంటే.. అర్జంట్ గా రాష్ట్రంలో ఎన్నికలు జరగాలి, టీడీపీ అధికారంలోకి రావాలని కలలు కంటున్నారు.

మూడు రాజధానులకు ప్రజామోదం లేదు, దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రండి అంటూ జగన్ కు సవాల్ విసురుతున్నారు. మూడు రాజధానుల బిల్లుకి గవర్నర్ ఆమోదముద్ర పడిన తర్వాత చంద్రబాబు విద్వేషంతో రగిలిపోయారు. తన ఆవేదనంతా ప్రెస్ మీట్ లో వెళ్లగక్కారు.

వాస్తవానికి మూడు రాజధానుల వ్యవహారంలో ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషిస్తున్నారు, హైకోర్టు ఏర్పాటు రాయలసీమ వాసులకు ఆనందాన్నిస్తోంది. మధ్యలో చంద్రబాబు మాత్రం విద్వేషంతో ప్రజల్ని రెచ్చగొట్టాలనుకుంటున్నారు. అసెంబ్లీ ఉన్న అమరావతి రాజధాని కాకుండా పోతుందా? అసలు అక్కడి రైతులకు వచ్చిన నష్టమేంటి? ఇవన్నీ తరచి చూస్తే ఇది చంద్రబాబు బాధ తప్ప ప్రజల బాధ కాదని అర్థమవుతుంది.

బాబు మాత్రం రాష్ట్ర ప్రజలంతా మూడు రాజధానుల వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నారని వితండవాదం చేస్తున్నారు. అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్దామంటూ, రాజధాని సమస్యను రెఫరండంగా పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ చరిత్రలో ఎన్నడూ ఎరగని ఘోర పరాభవం జరిగి ఏడాదిన్నర మాత్రమే. అంతలోనే చంద్రబాబుకి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి? అమరావతి ప్రజలు నష్టపోతున్నారనే విషయం రాష్ట్రవ్యాప్త రెఫరండం ఎందుకు అవుతుంది. ఉత్తరాంధ్ర వాసులు తమకు పరిపాలన రాజధాని వద్దని అంటారా? రాయలసీమ ప్రజలు హైకోర్టు మాకు అక్కర్లేదని చెబుతారా? కేవలం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని, మూడు రాజధానులు ఏర్పాటై సమగ్ర అభివృద్ధి జరిగితే.. చరిత్రలో ఇక టీడీపీ కోలుకోలేదనేది చంద్రబాబు బాధ.

అమరావతి ప్రాంతంలో భూముల వ్యవహారంతో కలిగే ఆర్థిక నష్టం కూడా అపారం. అందుకే రెఫరెండం, అసెంబ్లీ రద్దు, మధ్యంతర ఎన్నికలంటూ కామెడీ చేస్తున్నారు బాబు.