రాజీనామాస్త్రానికి విలవిల్లాడుతున్న చంద్రబాబు…

మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదముద్ర పడిన వెంటనే చంద్రబాబు రాజీనామాస్త్రాన్ని బైటకు తీశారు. మూడు రాజధానులకు ప్రజామోదం లేదని, దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. పనిలో పనిగా తమ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీతో రాజీనామా డ్రామా ఆడించారు.

అయితే రాజీనామాస్త్రం రివర్స్ లో వచ్చి బాబుకే గుచ్చుకుంది. వైసీపీ నేతలంతా చంద్రబాబు అండ్ కో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ కాదు.. కొడాలి నాని వంటి నేతలు.. మగాడివైతే చేసి చూపించు అంటూ పరువుతీసేశారు. ఇలాంటి సవాళ్లను సీరియస్ గా తీసుకునే రకం చంద్రబాబు కాదు కానీ.. అసలా ఆలోచన వస్తేనే ఆయన వెన్నులో వణుకుపుడుతోంది.

వైసీపీ డిమాండ్ ని ఒప్పుకోకపోవచ్చు కానీ, రేపు అమరావతి రైతులంతా టీడీపీ నేతల్ని రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తే ఏంచేయాలి? ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు వచ్చినవారందర్నీ రాజీనామా లెటర్లు అడిగితే ఎలా మేనేజ్ చేయాలి? ఇదే ఇప్పుడు బాబు బాధంతా.

గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో కూడా తమ వద్దకు పరామర్శకోసం వచ్చిన నేతలందరి దగ్గరా రాజీనామా లేఖల్ని తీసుకుని సంతోష పడ్డారు ఉద్యమకారులు. వాటితో ఒరిగేదేమీ లేదని ఇచ్చినవారికి తెలుసు, తీసుకున్నవారికీ తెలుసు. కానీ అదో తృప్తి అంతే.

అయితే ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తమ ఎమ్మెల్యేలందర్నీ రాజీనామా చేయాలని చంద్రబాబు పిలుపునిస్తే ఎంతమంది స్పందిస్తారు? ఇప్పటికే ముగ్గురు చేజారారు. మిగతావాళ్ల మనసులో ఏముందో బాబుకి కూడా తెలియదు. ఉత్తరాంధ్రవాళ్లు రాజీనామాకి సిద్ధపడితే అది ఆత్మహత్యా సదృశమే. రాయలసీమలో బావా బామ్మర్ది తప్ప ఇంకెవరూ లేరు.

పొరపాటున రాజీనామా చేద్దాం అని చంద్రబాబు అంటే ఆయన వెంట ఉండేవారెవరో, వెళ్లిపోయేవారెవరో తేలిపోతుంది. ఇప్పటి వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి రాజీనామా ప్రస్తావనతో బైటపడుతుంది.

అందుకే ఆ గుట్టు చెదిరిపోకుండా ఉండేందుకే చంద్రబాబు గింజుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని తాను చేసిన డిమాండ్ ని కూడా పూర్తిగా పక్కనపెట్టేశారు. వైసీపీ సవాల్ ని వినీ విననట్టుగా వదిలేసి జగన్ పై ఎదురుదాడి ప్రారంభించారు. మొత్తమ్మీద రాజీనామాస్త్రం చంద్రబాబుకే రివర్స్ లో వచ్చి గుచ్చుకుంది.