మిగతా 11 జిల్లాల సంగతేంటి పవన్..?

అమరావతి భవిష్యత్ పై నిర్ణయం తీసుకోడానికి పార్టీ నేతలతో జనసేన టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది. తీరా అందులో తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం ఏంటంటే.. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు, అందులోనూ కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలట.

అసలు టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని డిమాండ్ చేసే అర్హత జనసేనకు ఉందా. పోనీ ఉందే అనుకుందాం. రెండు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది. మిగతా 11 జిల్లాల పరిస్థితి ఏంటి? అంటే 11 జిల్లాల నాయకులు, ప్రజలకు ఈ పని ఇష్టంలేదని పవన్ కల్యాణే పరోక్షంగా ఒప్పుకుంటున్నట్టు కాదా? అలాంటప్పుడు రాజీనామాల డ్రామా ఎందుకు.

టీడీపీ, వైసీపీ నేతలు రాజీనామాలు చేసి రైతులకు అండగా ఉద్యమాన్ని నడిపిస్తే రాష్ట్రంలో పరిస్థితులేమైనా తారుమారవుతాయా..? ఉప ఎన్నికలు రావడం మినహా ఏమైనా సాధించగలరా? ఇవన్నీ ఆలోచిస్తే అసలు పవన్ కల్యాణ్ వాదనలో పసలేదని అర్థమవుతుంది.

అమరావతికి తాను అనుకూలం అని చెప్పలేరు, మరోవైపు మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకించనూ లేరు. ఈ సందిగ్భంలోనుంచి ఓ క్లారిటీ వస్తుందనుకుంటే.. సమావేశం తర్వాత మరింత అయోమయంలో పడిపోయారు పవన్ కల్యాణ్. అందుకే రాజీనామాల డ్రామాలో తాను కూడా ఓ సభ్యుడిగా చేరిపోయారు.

ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి అమరావతి రైతులకు అండగా నిలబడాలని కోరారు. ఇన్ని మాటలు చెబుతున్న పవన్ కల్యాణ్ కేంద్రంతో మాట్లాడి తాను అనుకున్నది సాధించొచ్చు కదా. దేశవ్యాప్తంగా అమలు కాబోయే నూతన విద్యా విధానంలో తన పాత్ర ఎంతో ఉందని చెప్పుకుంటున్న జనసేనాని.. మూడు రాజధానుల విషయంలో ఆమాత్రం కేంద్రాన్ని ఒప్పించలేరా. అమరావతిని మాత్రమే రాజధానిగా ఉంచి, రైతుల కష్టాలు తీర్చలేరా.

అలా చేస్తే మిగతా 11 జిల్లాల సంగతేమో కానీ.. ఆ రెండు జిల్లాల ప్రజలు పవన్ ని దేవుడిలా చూస్తారు కదా? అయినా సరే అమరావతికి జై అనడానికి ఎందుకో పవన్ కి ధైర్యం సరిపోవడంలేదు. అందుకే రైతుల కష్టాలు, రైతుల కన్నీళ్లు అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు.