ఎన్నికలే వస్తే చంద్రబాబు అజెండా ఏంటి?

రాజధాని అంశంతో చంద్రబాబు పూర్తిగా అయోమయంలో పడిపోయారని అర్థమవుతోంది. ఆయన అనుకుంటున్నట్టు అమరావతికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా నిరసన జ్వాలలు అంటుకోలేదు. కనీసం అమరావతిలో కూడా ఆశించిన స్థాయిలో ఆందోళనలు వ్యక్తం కాలేదు. టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న విపరీత ప్రచారం మినహా ఏపీలో ఇంకేమీ జరగడంలేదు.

ఇలాంటి సమయంలో మూడు రాజధానులను వ్యతిరేకించి తనకు తానే ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులకు విలన్ గా మారారు చంద్రబాబు. ఒకవేళ చంద్రబాబు అనుకున్నట్టే జగన్ అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి. కనీసం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా గెలిచే పరిస్థితి ఉందా? పోనీ రాజధాని ప్రాంతం మినహాయిద్దాం. మిగతా 11 జిల్లాల్లో కూడా టీడీపీ ఇదే అజెండాతో ఎన్నికలకు వెళ్లి గెలుస్తుందా? విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్రలో టీడీపీ ఓట్లు అడగగలదా. రాయలసీమకు హైకోర్టు వద్దంటూ ఆయా జిల్లాల్లో గెలవగలదా? అమరావతి అజెండాతో ఇవేవీ సాధ్యం కాదు. పైగా జగన్ తాను మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేసి చూపిస్తానంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అనే అంశం జనంలో బాగా నాటుకుపోయి ఉంది. నవరత్న పథకాల విజయాలు ఎలాగూ అండగా ఉన్నాయి. ఇంత చేసిన జగన్ ని జనం తిరస్కరించే సమస్యే లేదు.

ఉప ఎన్నికలు కాదు కదా 2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబు అమరావతి అజెండాపై పోటీ చేయలేరు. చేస్తే ఇప్పుడు గెలిచిన 23లో సగానికి సగం సీట్లలో కోతపడే అవకాశముంది. 11 జిల్లాల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే చంద్రబాబు పైకి అమరావతి అజెండా అంటున్నా.. లోపల మాత్రం మిగతా జిల్లాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతపై ఆందోళన పడుతున్నారు.

అందుకే జనం రోడ్లపైకి రావాలి, యువత ముందుండి పోరాటం చేయాలి అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ రాష్ట్ర ఎన్నికల్లో అమరావతి అంశం ప్రధాన అజెండా కానే కాదు.