స్టాప్ ఆర్డర్‌ పంపిన కృష్ణా బోర్డు

గత కొంత కాలంగా శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో భారీగా నీటిని కిందకు వదులుతోంది. ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి వదిలిపెడుతోంది. దీంతో శ్రీశైలంలో నీటిమట్టం పెరగడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులకు చుక్క నీరు అందకుండాపోతోంది. దీనిపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది.

ఇదివరకే ఒకసారి విద్యుత్ ఉత్పత్తిని ఆపేయాలని బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. అయినా పట్టించుకోకుండా టీఎస్‌ సర్కారు నీటికి దిగువకు వదిలిపెడుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణా రివర్ బోర్డు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టాప్ ఆర్డర్‌ను జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ చర్యల వల్ల ఏపీలోని ఏడు జిల్లాలకు తాగు నీరు కూడా అందకుండాపోతోందని బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్ల ఏపీలో కరువు జిల్లాలు అల్లాడిపోయే పరిస్థితి ఉందని అసహనం వ్యక్తం చేసింది. తక్షణం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలంటూ స్టాప్ ఆర్డర్‌ను ఇచ్చింది. ఈసారైనా బోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం ఖాతరు చేస్తుందో లేదో చూడాలి.