కరోనాతో సీపీఎం మాజీ ఎమ్మెల్యే మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందారు. పది రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. నిన్న ఆయన ఆరోగ్యం విషమించడంతో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

పదిరోజులుగా ఆయనకు జ్వరం ఉంది. సొంతూరు సున్నంవారిగూడెంలో ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. ఆయన ఇంట్లో వారికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈయనకు మొదట్లో నెగటివ్‌ తేలింది. దీంతో డెంగీ అని చికిత్స అందిస్తున్నారు. అయితే ఇటీవల చేసిన పరీక్షల్లో కరోనా అని తేలడంతో సోమవారం సాయంత్రం విజయవాడ కరోనా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించడంతో చనిపోయారు.

భద్రాచలం ఎమ్మెల్యేగా సీపీఎం తరపున 1999,2004,2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా రంపచోడవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1960 ఆగస్ట్‌ 8న జన్మించిన రాజయ్య సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని వీఆర్‌పురం మండలం సున్నంవారి గూడెం. రాష్ట్ర విభజనతో ఆయన ఊరు ఏపీలో కలవడంతో అక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం సీపీఎం ఏపీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు.