ప్రజలు కలసి రావాలి… కేంద్రం జోక్యం చేసుకోవాలి… అమరావతిపై చేతులెత్తేసిన చంద్రబాబు…

48గంటల డెడ్ లైన్ తర్వాత తాను చెప్పినట్టే ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు. అందరూ ఊహించినట్టుగానే “వైసీపీ నేతలకు ధైర్యం లేదు, రాజీనామా సవాల్ ని స్వీకరించలేకపోయారు, పిరికిపందల్లా పారిపోయారు” అంటూ విమర్శించారు.

ఈ జూమ్ మీట్ లోనే చంద్రబాబు ఓ విషయంపై పూర్తి స్పష్టతనిచ్చారు. ఉద్యమం ప్రజల చేతుల్లో ఉందని, కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పుకొచ్చారు. ఓ అడుగు ముందుకేసి, వైసీపీ, కాంగ్రెస్ నేతలు కూడా జగన్ ని నిలదీయాలని కోరారు.

అంటే టీడీపీ ఇక అమరావతి ఉద్యమంపై చేసేదేంలేదని, 48గంటల డెడ్ లైన్ కూడా ఓ ప్రసహనం అని పరోక్షంగా ఒప్పుకున్నారు చంద్రబాబు.

గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి అనుకూలంగా మాట్లాడారని, 2019 ఎన్నికల వైసీపీ మేనిఫెస్టోలో కూడా మూడు రాజధానుల అంశం లేదని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో లేని అంశాన్ని అమలు చేస్తున్నారంటే జగన్ అబద్ధమాడుతున్నట్టేనని అన్నారు బాబు.

ఇదేదో అమరావతి రైతుల సమస్య కాదని, రాష్ట్ర ప్రజలందరి సమస్య, భావితరాల సమస్య అంటూ పూర్తిగా వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఇకపై ప్రజలే అమరావతికి అనుకూలంగా పోరాడాలన్నారు. అంతే కాదు అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరారు చంద్రబాబు.

మొత్తానికి చంద్రబాబు ఈ జూమ్ మీట్ ద్వారా తన భారాన్ని దించుకునే ప్రయత్నం చేశారు. ఉద్యమాన్ని ప్రజలు నడపాలని, కేంద్రం జోక్యం చేసుకోవాలని, టీడీపీ చేసేదేం లేదని తేల్చి చెప్పారు. ఓ దశలో రాష్ట్ర విభజన అంశాన్ని రాజధానుల విభజనతో పోల్చాలనుకున్నారు బాబు. ఇది రాష్ట్ర విభజనకంటే పెద్ద అన్యాయమని చెప్పారు.

విభజన సమయంలో చంద్రబాబు రెండు నాల్కల ధోరణిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నా.. అనుభవజ్ఞుడనే ఉద్దేశంతోనే 2014లో గెలిపించారు. ఐదేళ్లకే తన ప్రతాపం చూపించి అభాసుపాలయ్యారు చంద్రబాబు. మరిప్పుడు కనీసం జగన్ పాలన ఐదేళ్లు గడిచేవరకు వేచి చూడాలి కదా? ఏడాదిన్నరకే అసెంబ్లీ రద్దు చేయాలి, ఎన్నికలకు వెళ్లాలి, అదీ అమరావతి అజెండాగా అనడం చంద్రబాబు రాజకీయ స్వార్థానికి నిదర్శనం కాదా? టీడీపీ రాజీనామాలపై స్పందించమంటే దానికి కూడా షరతులు వర్తిస్తాయని చెప్పారు చంద్రబాబు.

అమరావతే ఏకైక రాజధాని అని ప్రకటిస్తే టీడీపీ నేతలు తమ పదవులు వదిలేయడానికి సిద్ధమంటూ సవాల్ విసిరారు. అంత త్యాగమూర్తి ఆ పనేదో ఇప్పుడే చేయాలి కదా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.

48గంటల డెడ్ లైన్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు.. తన భారం దించుకునే ప్రయత్నం చేశారు. డెడ్ లైన్ అంటూ కొండంత రాగం తీసి చివరకు కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ ముక్తాయించారు. అమరావతిపై టీడీపీ పోరాటం ముగిసినట్టేనని పరోక్షంగా ఒప్పుకున్నారు బాబు.