కరోనాపై పోరాటానికి ముందుకొచ్చిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సతీమణి

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం భార్య హీనాటక్‌ కరోనాపై పోరులో తన వంతు సేవ చేసేందుకు ముందుకొచ్చారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఆరు నెలల వ్యవధి కాంట్రాక్ట్‌తో ఇటీవల ఏపీ ప్రభుత్వం వైద్య సిబ్బంది నియామకాలు చేపడుతోంది.

ఇందుకోసం ఎస్పీ భార్య హీనాటక్‌ దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు నిర్వహించిన ఇంటర్వ్యూకు నేరుగా హాజరై కరోనా పోరులో భాగస్వామ్యం అయ్యే అవకాశం సొంతం చేసుకున్నారు.

మంగళవారం నియామక ఉత్తర్వులను అందుకున్నారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమె కరోనా రోగులకు వైద్యం అందించనున్నారు. వైరాలజీ ల్యాబ్‌లో స్పెషలిస్ట్‌గా హీనాటక్‌ను నియమించారు. కశ్మీర్‌లో హీనాటక్ ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. హైదరాబాద్‌లో పీజీ చేశారు. గతంలో ఆమె నిమ్స్‌లో వైద్యురాలిగా పనిచేశారు కూడా.