ఏపీకి 13 రాజధానులా..? బీజేపీ వెటకారంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్..

చంద్రబాబు పెట్టినట్టు ఒకటే రాజధాని కానీ, వైసీపీ వాళ్లు చేస్తున్నట్టు మూడు రాజధానులు కానీ తాము పెట్టబోమని.. మాకు అధికారం వస్తే జిల్లా కేంద్రాలన్నీ రాజధానులేనంటూ వెటకారమాడారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.

మాకు అధికారం ఇప్పించండి వెంటనే సమస్య పరిష్కరిస్తాం, 13 జిల్లాల కేంద్రలన్నిటినీ రాజధానులు చేసి సమన్యాయం చేస్తామని సెలవిచ్చారు.

బీజేపీ నేతగా ఆయన మాట్లాడితే పెద్దగా ఎవరూ పట్టించుకోరు, కానీ బాధ్యతాయుతమైన అధ్యక్ష పదవిలో ఉండి ఇలాంటి వెటకారాలాడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. రాజధాని అంశంపై బీజేపీకి ఏపాటి చిత్తశుద్ధి ఉందో దీన్నిబట్టి అర్థమవుతోంది. ఆ పార్టీ గోడమీద పిల్లివాటం మరోసారి బట్టబయలైంది.

ఏపీకి రాజధాని ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని సన్నాయి నొక్కులు నొక్కుతూనే.. అమరావతి రైతులకు అండగా నిలబడతామంటారు బీజేపీ, జనసేన నేతలు. అదే సమయంలో మూడు రాజధానులకు తాము వ్యతిరేకం కాదని చెబుతుంటారు.

అంటే అటు టీడీపీ విధానాన్ని కానీ, ఇటు వైసీపీ విధానాన్ని కానీ తాము సమర్థించడంలేదని, రాష్ట్రంలో తమది మూడో ప్రత్యామ్నాయమని చెప్పుకోవడమే వారి సిద్ధాంతం. అందులోనూ 2024లో తాము కచ్చితంగా అధికారంలోకి వస్తామని, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి సీఎం అవుతారని అధ్యక్ష పదవి చేపట్టగానే సెలవిచ్చారు వీర్రాజు.

ఏపీకి 13 రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ వెకిలిగా మాట్లాడితే బీజేపీ అధికారంలోకి రాగలదా? ప్రజల మనోభావాలని గౌరవించాలి కానీ, అసలు కే మోసం వచ్చేలా మాట్లాడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

ఓ ప్రైవేట్ ఛానెల్ లైవ్ డిబేట్ లో వీర్రాజు మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. మీ 13 రాజధానులు మాకొద్దు, పొరపాటున కూడా మీకు అధికారం మేం ఇవ్వబోమంటున్నారు నెటిజన్లు.

టీవీ ఛానెల్ వాళ్లు రెచ్చగొడితే.. మరీ ఇంత వెటకారంగా మాట్లాడాలా అటూ నిలదీస్తున్నారు. మొత్తమ్మీద వీర్రాజు వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.