పాథ్ బ్రేకింగ్ మూవీకి సీక్వెల్

చిత్రం.. టాలీవుడ్ లో ఒక రకంగా ఇది పాథ్ బ్రేకింగ్ మూవీ. టీనేజ్ లోనే తల్లిగా మారిన ఓ అమ్మాయి, ఎలాంటి ఆధారం లేని ఓ అబ్బాయి సాగించిన జీవితమే ఈ సినిమా. ఈ మూవీతోనే దర్శకుడిగా మారాడు తేజ. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోందట.

రీసెంట్ గా కాస్టింగ్ కాల్ కు పిలుపునిచ్చాడు తేజ. కొంతమంది నటీనటుల్ని కూడా ఎంపిక చేశాడు. చిత్రం సినిమా సీక్వెల్ కోసమే వీళ్లందర్నీ తేజ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా వీళ్లలో కొందరు కనిపిస్తారట. అటు తేజ తీస్తున్న వెబ్ సిరీస్ లో కూడా ఈ కొత్త నటీనటులు కనిపించబోతున్నారు.

కేవలం 46 లక్షల రూపాయల బడ్జెట్ తో, పూర్తిగా రామోజీ ఫిలింసిటీలో చిత్రం సినిమాను తీశారు. ఈ మూవీతో నిర్మాత రామోజీరావు 5 రెట్లు లాభాలు అందుకున్నారు అప్పట్లో. ఈ సీక్వెల్ తోనే రామోజీరావు మరోసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.