ఆంధ్రజ్యోతికి ఛాలెంజ్ విసిరిన సీఎంఓ కార్యాలయం

ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాయడం, ప్రజలను మభ్యపెట్టడం, టీడీపీకి వంతపాడటం.. కొన్ని మీడియా సంస్థలకు ఇది నిత్యకృత్యంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవాలు మరుగున పెట్టినా పర్వాలేదు కానీ, కుట్రపూరితంగా అవాస్తవాలు ప్రచారం చేయడం మాత్రం నిజంగా శిక్షార్హమే.

తాజాగా ఇలాంటి తప్పుడు కథనాల్ని ప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానెల్ పై సీఎంఓ అధికారులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ పేద కుటుంబం విషయంలో ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రసారం చేసింది.

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన చల్లా వీరనాగరాజు అనే యువకుడు కరెంట్ షాక్ కు గురి కావడంతో ఎడమచేయి, చెవి, కాలు కోల్పోయాడు. హైదరాబాద్ లోని వి-కేర్ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. ఏడాది తర్వాత మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో తిరిగి అదే ఆస్పత్రికి వెళ్లిన నాగరాజుకి ఈసారి ఆస్పత్రి షాకిచ్చింది.

శరీరమంతా ఇన్ఫెక్షన్ పాకిపోయిందని 3 ఆపరేషన్లు చేస్తేనే ప్రాణం నిలబడుతుందని 19 లక్షల రూపాయలకు ఎస్టిమేషన్ వేసిచ్చింది. ఆ ఎస్టిమేషన్ తో బాధితుడు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రయత్నించారు. అయితే సీఎంఓ అధికారుల పరిశీలనలో ఆపరేషన్ కు అంత వ్యయం కాదని తేలింది.

అపోలో, గ్లోబల్ ఆస్పత్రులతో రీ వెరిఫికేషన్ చేయించగా కేవలం 5లక్షలతో ఆపరేషన్ పూర్తవుతుందని రిపోర్ట్ లు వచ్చాయి. అదే సమయంలో గతంలో జరిగిన ఆపరేషన్ సక్రమంగా లేకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ సోకినట్టు అనుమానం కూడా వ్యక్తం చేశారు.

దీంతో సీఎంఓ అధికారులు ఆ ఫైల్ పక్కనపెట్టి, బాధితుడికి సమాచారమిచ్చారు. ఆయన ఆరోగ్యం దృష్ట్యా ఇతర ప్రముఖ ఆస్పత్రులలో ఆపరేషన్ చేయించుకోవాలని, ఇతర ప్రముఖ ఆస్పత్రుల ఎస్టిమేషన్ స్లిప్ తో తిరిగి దరఖాస్తు చేసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తామని సూచించారు.

దీంతో ఏబీఎన్ రంగంలోకి దిగింది. వాస్తవాలను కప్పిపుచ్చి సీఎంఓ అధికారులు తాము చెప్పినచోట ఆపరేషన్ చేయించుకుంటేనే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని కండిషన్ పెట్టారంటూ తప్పుడు కథనాలల్లింది.

ప్రైవేట్ ఆస్పత్రులతో అధికారులు కుమ్మక్కయ్యారంటూ నిందలేసింది. దీనిపై సీఎంఓ అధికారులు తీవ్రంగా స్పందించారు. పూర్తి వివరాలతో కూడిన స్టేట్ మెంట్ ఇచ్చారు. వి-కేర్ ఆస్పత్రి వేసిన ఎస్టిమేషన్ సరైనదేనని ఇతర ఏ ఆస్పత్రితో అయినా నిరూపించాలని ఏబీఎన్ కి ఓ పెన్ ఛాలెంజ్ చేశారు. బ్రోకర్లు, నకిలీ ఆస్పత్రుల వలలో పడొద్దని బాధితుకు సూచించారు.