ఉద్యమం అమరావతి కోసమా..? అభివృద్ధి కోసమా..?

అమరావతికోసం ఉద్యమించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా సానుకూల స్పందనలు కనిపించడంలేదు.

ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన కొంతమంది టీడీపీ నాయకులు మాత్రమే అమరావతే ఏకైక రాజధాని కావాలని బైటకొస్తున్నారు. వీరిలో కొంతమందికి చంద్రబాబు తప్ప ఇంకే దిక్కూ లేదు. ఇంకొంతమంది మనసు చంపుకుని, సొంత ప్రాంత అభివృద్ధికి వెన్నుపోటు పొడుస్తున్నామని తెలిసీ అమరావతికి జై కొడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో అమరావతికోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమం మొదలయ్యే ప్రసక్తే లేదని తెలుస్తోంది. మరోవైపు అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుకట్ట వేయాలని శత విధాలా ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. కోర్టులో కేసులు వేసి మరీ అడ్డుకోవాలని చూస్తున్నారు.

అదే జరిగితే.. మూడు రాజధానుల ఏర్పాటుకు ఆటంకాలు ఎదురైతే.. అప్పుడు కచ్చితంగా రాష్ట్రమంతా ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు తీర్పులతో మూడు రాజధానుల ఏర్పాటుకి ముప్పు వచ్చేట్లయితే రాష్ట్రమంతా ఉద్యమం మొదలు కావడం గ్యారెంటీ.

విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుతో… ఉత్తరాంధ్ర, రాయలసీమవాసులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో తమ ప్రాంతానికి కూడా భాగస్వామ్యం ఉంటుందని వారు సంబరపడుతున్నారు. కేంద్రం జోక్యం చేసుకున్నా, కోర్టులు అడ్డుకున్నా.. ఈ సంతోషమంతా ఆవిరవుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు.

మూడు రాజధానులతో అమరావతి ప్రజలకు కలిగిందనుకుంటున్న ఇబ్బంది కంటే.. ఏకైక రాజధానితో ఉత్తరాంధ్ర, రాయలసీమవాసులకు కలిగే ఆశాభంగమే ఎక్కువ. ఆ దశలో ఎవరూ వెనక్కు తగ్గుతారని అంచనా వేయలేం? చేతిదాకా వచ్చింది, నోటిదాకా రాకపోతే వారి బాధ ఆగ్రహ జ్వాలగా మారే ప్రమాదమూ ఉంది.

చంద్రబాబు కలగంటున్నట్టు రాష్ట్రమంతా అప్పుడు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాన్ని నడిపిస్తుంది. అయితే అది అమరావతికోసం కాదు, అభివృద్ధికోసం. అలాంటి పరిస్థితులు రాకూడదనుకుంటే, మిగతా ప్రాంతాల్లో టీడీపీ బతికుండాలనుకుంటే.. చంద్రబాబు మూడు రాజధానులకు మద్దతు తెలపాల్సిందే. లేకపోతే తెలంగాణ టీడీపీలాగా.. ఉత్తరాంధ్ర టీడీపీ, రాయలసీమ టీడీపీ ఏర్పాటు చేసుకుని ఉత్సవ విగ్రహాలను పెట్టుకోవాల్సిందే.