టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత

దుబ్బాక టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నమూశారు. అనారోగ్యంతో కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. 1982 నుంచి 2004 వరకు రామలింగారెడ్డి జర్నలిస్టుగా పనిచేశారు. కొద్దికాలం నక్సలైట్లతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

2009లో మాత్రమే ఓడిపోయారు. 2004 లో మొదటి సరిగా దుబ్బాక నుంచి ఎమ్యెల్యేగా గెలుపొందారు. 2008 ఉప ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందారు. ప్రస్తుతం అంచనాల కమిటీ చైర్మన్‌గా రామలింగారెడ్డి ఉన్నారు.

రామలింగారెడ్డి తొలి నుంచి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. కాలికి గాయం అవడంతో ఇటీవల చికిత్స కోసం ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారు. ఈ సమయంలోనే ఆయన పరిస్థితి విషమించినట్టు చెబుతున్నారు.

రామలింగారెడ్డిది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామం. 1962 అక్టోబర్ లో జన్మించిన రామలింగారెడ్డికి భార్య సుజాత, కుమారుడు సతీష్ రెడ్డి, కుమార్తె ఉదయశ్రీ ఉన్నారు. దుబ్బాకలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.