పిల్లలు… మాస్కులు… ఇలా చెప్పాలి !

ఇకపై కొంత కాలంపాటు మనమంతా మాస్క్ లతోనే బతికేయాలని తెలుస్తూనే ఉంది. అయితే పెద్దవాళ్లకు ఈ విషయం అర్థమైనట్టుగా పిల్లలకు అర్థమయ్యే అవకాశం లేదు. అయినా ఏదోఒక విధంగా పిల్లలు మాస్క్ ని ధరించడానికి ఇష్టపడేలా చేయటం తల్లిదండ్రుల బాధ్యత. ఈ విషయంలో పిల్లల వైద్య నిపుణులు కొన్ని సలహాలను ఇస్తున్నారు.

  • అన్నింటికంటే ముఖ్యమైనది పిల్లలు ఎల్లప్పుడూ పెద్దలను అనుసరిస్తుంటారు. పెద్దవాళ్లు ఇంట్లోంచి బయటకు వెళ్లిన ప్రతిసారీ మాస్క్ ని ధరిస్తూ ఉంటే పిల్లలకు కూడా అది అలవాటుగా మారుతుంది. పెద్దవాళ్లు బయటకు వెళ్లేటప్పుడు పిల్లలు చూసేలా.. వారికి చూపించి మాస్కులు ధరిస్తూ ఉండాలి.
  • మరీ చిన్నపిల్లలున్న వారు… వారికి సరదాగా అనిపించేలా వారిచేత మాస్కులను తయారు చేయించాలి. దీని వలన వారు వాటిని ధరించడానికి ఇష్టపడతారు.
  • పిల్లలు ఆడుకునే బొమ్మలకు మాస్కులను కడుతూ ఉంటే కూడా పిల్లలకు వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది.
  • మాస్కు ఇచ్చే రక్షణ గురించి వారికి అర్థమయ్యే భాషలో వివరించాలి. కారులో సీటు బెల్టు ఎలాగో, తలపై టోపీ ఎలాగో, ఒంటికి దుస్తులు ఎలాగో మాస్కులు కూడా అలా అవసరమని వారు గుర్తించేలా చెప్పాలి.
  • కాస్త పెద్ద పిల్లలకయితే మాస్క్ లేకపోతే వైరస్ ఎలా వ్యాపిస్తుందో, మాస్క్ దానిని ఎలా అడ్డుకుంటుందో చెప్పవచ్చు.
  • వీటన్నింటితో పాటు మాస్క్ ధరించే విధానం గురించి కూడా తెలియజేయాలి. ముక్కుని నోటిని కవర్ చేయాలనే విషయాన్ని కూడా పదేపదే చెప్పాలి. వాడేసిన వాటిని దూరంగా పడేయాలని, తిరిగి వాటిని చేతులతో పట్టుకోకూడదని కూడా అర్థమయ్యేలా చేయాలి. అలాగే ఉతికేందుకు వీలున్న మాస్కుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సైతం చెబుతుండాలి.
  • కాస్త అవగాహన ఉన్న పిల్లలచేత… ఇతర చిన్నారులకు చెప్పించడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది.
  • మాస్క్ ధరించడం చాలా అవసరం… అనే భావాన్ని కలిగించేలా పెద్దలు ప్రవర్తించినప్పుడు పిల్లలు సైతం తమకు తాముగా వాటిని ధరించేందుకు సిద్ధపడతారు.